పట్టా, ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా మట్టి రైతు మట్టిని నమ్ముకుంటే.. నాయకులు మట్టిని అమ్ముకుంటున్నారా? తవ్వకాలు!
కొండాపూర్ ; కొండాపూర్ మండలంలో మట్టి వ్యాపారం కొత్త రూపం దాల్చిందా? రైతులు తమ భూములను నమ్ముకుని వ్యవసాయం చేస్తుంటే.. కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు మాత్రం భూముల్లోని మట్టినే వ్యాపారంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టా భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల నుంచి అనుమతులు లేకుండానే మట్టిని తవ్వి రాత్రివేళల్లో పరిశ్రమలు, వెంచర్లకు తరలిస్తున్నారనే ఫిర్యాదులు కలకలం రేపుతున్నాయి.
మైనింగ్ అనుమతి రాయికే.. మట్టికి అనుమతి ఉందా?
మల్లేపల్లి శివారులోని సర్వే నంబర్ 300లో ఉన్న పట్టా భూమి, తేర్పోల్ శివారులోని సర్వే నంబర్ 34లో ఉన్న ప్రభుత్వ భూమి పక్కపక్కనే గుట్టలుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో పలుగు రాయి తవ్వకాలకు మైనింగ్ అనుమతులు ఉన్నట్లు తెలుస్తోంది. రాయి వెలికితీసే క్రమంలో తొలగిస్తున్న మట్టిని తరలించేందుకు ప్రత్యేక అనుమతులు ఉన్నాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గుట్టల వద్ద పేరుకుపోయిన మట్టిని చుట్టుపక్కల పరిశ్రమలు, వెంచర్లకు రాత్రివేళల్లో తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ట్రిప్పుకు రూ.100 ఇవ్వాల్సిందేనా?
మట్టి తరలింపులో కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఓ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి ట్రాక్టర్ ప్రతి ట్రిప్పుకు రూ.100 చెల్లించాలని, లేదంటే మట్టి తరలించనివ్వబోమని చెప్పినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గతంలో పొలాలకు వెళ్లేందుకు మట్టితో రహదారి వేయించిన ట్రాక్టర్ యజమానులకు డబ్బులు చెల్లించకపోవడంతో రహదారిని మధ్యలో తవ్వి నిరసన తెలిపారనే ప్రచారం
అసైన్డ్ భూముల నుంచి పరిశ్రమలకు మట్టి!
గొల్లపల్లి శివారు సర్వే నంబర్ 75లోని అసైన్డ్ భూముల నుంచి కొంతకాలంగా రాత్రివేళల్లో మట్టిని తవ్వి పరిశ్రమలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటి అవసరాలకు, పొలాలకు వెళ్లేందుకు రహదారులు వేసుకుంటున్నామని అధికారులకు చెబుతూ, వాస్తవానికి మట్టిని లారీల ద్వారా బయటకు తరలిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
మునిదేవునిపల్లి భూములపై
మునిదేవునిపల్లి శివారులోని సర్వే నంబర్ 92లో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూముల నుంచి సైతం వెంచర్లకు రాత్రివేళల్లో మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలోని పలు ప్రాంతాల్లో వెంచర్లు, పరిశ్రమలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో మట్టి వ్యాపారం జోరుగా సాగుతోందని స్థానికులు చెబుతున్నారు.
అధికారుల పర్యవేక్షణ ఏది?
మట్టి తరలింపులో అధికార, ప్రతిపక్షాలకు చెందిన కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని అనుమతుల విషయంలో అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాల్సి ఉంది.
మండలంలో ఎక్కడెక్కడ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి? ఏ సర్వే నంబర్లలో అనుమతులు ఉన్నాయి? మైనింగ్ అనుమతులు రాయి వరకే పరిమితమా? మట్టి తరలింపునకు రెవెన్యూ, గనుల శాఖల అనుమతులు తీసుకున్నారా? రాత్రివేళల్లో తరలిస్తున్న మట్టి వాహనాలకు రవాణా అనుమతులు ఉన్నాయా? ప్రభుత్వ, అసైన్డ్ భూముల నుంచి మట్టి తరలింపుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
రైతుల భూముల నుంచి మట్టి మాయమవుతుంటే.. పర్యవేక్షించాల్సిన యంత్రాంగం ఏం చేస్తోంది? అన్న ప్రశ్నలు మండల ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి, అక్రమ తవ్వకాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.