నిజం గెలిచింది ..రాష్ట్రం అభివృద్ధి బాట పట్టింది : టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ
గుంటూరు, మేజర్‌న్యూస్ :
తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులను ఎదుర్కొని జైలు నుంచి విడుదలై నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తవుతోందని టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ పేర్కొన్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులన్నీ కోర్టుల్లో నిలబడలేక వీగిపోయాయని, అంతిమంగా సత్యమే గెలిచిందని ఆయన స్పష్టం చేశారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి వేళ అక్రమంగా అరెస్ట్ చేశారు. గత జగన్ ప్రభుత్వం కల్పించిన అబద్ధపు కేసులన్నింటినీ ఏసీబీ కోర్టు, హైకోర్టు, చివరకు సుప్రీంకోర్టు సైతం కొట్టివేశాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన దుర్మార్గానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు ఇచ్చి తగిన రీతిలో శిక్షించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నాణ్యమైన నైపుణ్యాలు నేర్పించి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి, వారి కుటుంబాలను ఆదుకోవాలనే మహత్తర ఆశయంతో 2014-19 మధ్య చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఈ సెంటర్ల ద్వారా సుమారు 2.13 లక్షల మందికి పైగా యువతకు శిక్షణ అందింది. వేలాది మంది యువతీయువకులు ఉపాధి పొంది స్థిరపడ్డారు. ఇంతటి పవిత్రమైన పథకంలో అవినీతి జరిగిందంటూ అసత్యాలు ప్రచారం చేసి, చంద్రబాబు గారిని అన్యాయంగా 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. చంద్రబాబు గారి నిజాయితీ, రాష్ట్రం కోసం ఆయన పడిన కష్టం ప్రజలకు స్పష్టంగా తెలుసు. అందుకే ఆ 53 రోజులు కేవలం టీడీపీ కార్యకర్తలే కాకుండా, సామాన్య ప్రజలు, మహిళలు, యువత స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి శాంతియుత నిరసనలు చేపట్టారు. చంద్రబాబు గారు ఆనాడు హైటెక్ సిటీ, ఇంజనీరింగ్ కాలేజీలతో తీర్చిదిద్దిన నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉండటంతో, విదేశాల్లో సైతం ఆయన కోసం నిరసన గళాలు వినిపించాయి. ధర్మం, న్యాయం ఎప్పటికీ ఓడిపోవని, చివరకు ప్రజలు మరియు న్యాయస్థానాలు చంద్రబాబు నాయుడు గారి నిజాయితీని నిరూపించాయని వర్మ స్పష్టం చేశారు.
చంద్రబాబు గారిని జైల్లో పెట్టగలరేమో కానీ.. ప్రజల గుండెల్లో ఉన్న అభిమానాన్ని కాదు
చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టి టీడీపీని భూస్థాపితం చేయాలని చూసిన వారికి రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ పేర్కొన్నారు. చంద్రబాబు గారిని జైలు గోడల మధ్య బంధించగలిగారేమో కానీ, ప్రజల మనసుల్లో ఆయనపై ఉన్న నమ్మకాన్ని, అచంచలమైన అభిమానాన్ని ఎవరూ బంధించలేకపోయారని ఆయన స్పష్టం చేశారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి అన్యాయం జరిగితే, ప్రపంచవ్యాప్తంగా ఇంతటి నిరసనలు, ఉద్యమాలు రావడం చూసి ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయాయి. ఆ 53 రోజులు టీడీపీ శ్రేణులు, సామాన్య ప్రజలు చేపట్టిన శాంతియుత సత్యాగ్రహాలు, వెల్లువెత్తిన ప్రజా ఆగ్రహాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి తాను చేసిన తప్పుకు లోలోపల ఎంతగానో తలపట్టుకుని ఏడ్చారు. ఇటువంటి నాయకుడి పాలనను భరించలేమని, ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు గారే రావాలని ప్రజలు అప్పుడే నిశ్చయించుకుని ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలు, న్యాయవ్యవస్థపై చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ గౌరవం ఉంది. అదే వేరే ఎవరైనా నాయకుడైతే అధికారం రాగానే అక్రమంగా అరెస్టులు చేసి కక్ష తీర్చుకునేవారు. ఇవాళ వైసీపీ నేతలను, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం మా ప్రభుత్వానికి పెద్ద పని కాదు, చేయగలం కూడా. కానీ మేము చట్టం, రాజ్యాంగ పరిధిలోనే నడుస్తాం. ప్రత్యర్థుల దుర్మార్గాలకు కక్షలతో కాకుండా, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించి అభివృద్ధితోటే సమాధానం చెబుతున్నాం. గత ప్రభుత్వం సర్వనాశనం చేసిన రాజధాని అమరావతిని నేడు శరవేగంగా పునర్నిర్మిస్తున్నాం. ఇప్పటికే సీఆర్డీఏ భవనం అందుబాటులోకి వచ్చింది, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల క్వార్టర్స్ పూర్తవుతున్నాయి, అసెంబ్లీ భవన నిర్మాణం పరుగులు పెడుతోంది. అలాగే గతంలో పడుకోబెట్టిన జీవనాడి పోలవరం ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించి, మొన్ననే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖపట్నం వరకు తాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే. అతి త్వరలోనే పోలవరం పనులన్నీ పూర్తి చేసి, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు గారు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.
అక్రమ నిర్బంధాన్ని ఆత్మవిశ్వాసంతో జయించారు.. ప్రజా సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నారు
చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో నిర్బంధించి సైకలాజికల్‌గా కుంగదీయాలని గత వైసీపీ ప్రభుత్వం చూసినప్పటికీ, ఆయన ఏనాడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలై నేటికి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఆనాటి చీకటి రోజులను, అక్రమ కేసులను ఎదుర్కొని నేడు రాష్ట్రాన్ని ఎలా పునర్నిర్మిస్తున్నారో ప్రజలంతా గుర్తు చేసుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం వైపు చూడడానికే భయపడిన పారిశ్రామికవేత్తలు, నేడు పరిశ్రమలు పెట్టేందుకు క్యూ కడుతున్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలో, మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక చొరవతో ఏకంగా రూ. 29 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ‘యువగళం’ పాదయాత్రలో తల్లిదండ్రులు తమ పిల్లల ఉద్యోగాల కోసం పెట్టుకున్న మొరలను గుర్తుపెట్టుకుని, కూటమి మేనిఫెస్టో హామీల మేరకు యువతకు విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. ఎలాంటి తప్పు చేయకపోయినా 53 రోజుల పాటు జైల్లో పెట్టి వేధించారు. వేరే నాయకుడైతే అధికారం రాగానే అదే తరహాలో ప్రతీకారం తీర్చుకునేవారు. కానీ 'వాళ్లకు విచక్షణ లేనంత మాత్రాన మనం కూడా చట్టాన్ని అతిక్రమించకూడదు' అన్నదే చంద్రబాబు గారి సిద్ధాంతం. రాజ్యాంగం, న్యాయవ్యవస్థ నిర్దేశించిన పరిధిలోనే నడుస్తూ, దుర్మార్గాలకు సుపరిపాలనతోటే సమాధానం చెబుతున్నారు. గతంలో ఇద్దరు పిల్లలుంటే ఒక్కరికే ఇచ్చే అరకొర సంక్షేమానికి స్వస్తి పలికి, నేడు ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వారందరికీ 'తల్లికి వందనం' అందిస్తున్నాం. పెంచిన పెన్షన్లు, రైతుల సంక్షేమం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మేనిఫెస్టోలో చెప్పని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతి ఇంటికీ మేలు చేకూరుస్తున్నారు. ఆనాడు పోలీసులను దుర్వినియోగం చేస్తూ చేసిన రౌడీయిజానికి, అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలు, టీడీపీ శ్రేణులు శాంతియుత సత్యాగ్రహాలు చేశారు. చివరికి ఏసీబీ కోర్టు, హైకోర్టులు తప్పుడు కేసులను కొట్టివేసి చంద్రబాబు గారిని 'కడిగిన ముత్యం'లా నిరూపించాయి. న్యాయవ్యవస్థ క్లీన్ చిట్ ఇస్తే.. ప్రజావ్యవస్థ ఎన్నికల్లో తప్పు చేసిన వారిని కేవలం 11 సీట్లకు పరిమితం చేసి, చంద్రబాబు గారికి అఖండ మెజారిటీతో పట్టం కట్టింది. కష్టకాలంలో వెన్నంటి నిలిచి, ఇంతటి ప్రేమాభిమానాలు చూపించిన రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ రుణపడి ఉంటాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించి, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు.