NHM ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి.. ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలకు అండగా నిలవండి -ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఎన్ హెచ్ ఎం జేఏసీ బాధ్యుల హృదయపూర్వక విజ్ఞప్తి
ఎన్ హెచ్ ఎం జేఏసీ నాగర్‌కర్నూల్ జిల్లా ఆధ్వర్యంలో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న నిరవధిక సమ్మె శనివారం 19వ రోజుకు చేరుకుంది. ఉద్యోగులు తమ చేతులకు సంకెళ్లు ధరించి వినూత్నంగా నిరసన తెలిపి ధీనంగా అర్తించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాల నుంచి విముక్తి కల్పించి, తమకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి ఈ నిరసన ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎన్ హెచ్ ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్ మాట్లాడుతూ.. గత 19 రోజులుగా ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజారోగ్య పరిరక్షణలో, ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఉద్యోగులు అందించిన సేవలు మరువలేనివని, ప్రభుత్వాలు ఉన్నిచ్చే ఉద్యోగులను కోవిడ్ వారియర్స్ గా గుర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న 78 కేడర్ల ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు నేటికీ ఉద్యోగ భద్రత లేకపోవడం ఆవేదన కరమని పేర్కొన్నారు.ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా మానవతా దృక్పథంతో స్పందించి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని, ముఖ్యమంత్రి , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉద్యోగుల ప్రతినిధులతో చర్చలు జరిపి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. తమ న్యాయమైన హక్కులు సాధించే వరకు ఐక్యంగా, శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌస్ పాషా, హైమావతి, శ్రీనివాసులు, డాక్టర్ రామకృష్ణ, ప్రవీణ్ కుమార్, గోపి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
-పి.వినయ్ కుమార్ , నాగర్‌కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్