చింతకుంటలో విషాదం.. ఇద్దరు కుమారులతో సహా తల్లి మృతి
దారూర్, మేజర్ న్యూస్ :వికారాబాద్ జిల్లా దారూర్ మండలం చింతకుంట గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంట గ్రామానికి చెందిన భూపతిరెడ్డి భార్య వాసవి తన ఇద్దరు కుమారులతో కలిసి శనివారం సొంత గ్రామానికి వచ్చింది. మధ్యాహ్నం సమయంలో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో ముగ్గురూ కనిపించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వాసవి కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి, మృతికి గల కారణాలను నిర్ధారించాల్సి ఉంది. ఈ ఘటనతో చింతకుంట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.