ఎన్నికల సిబ్బందికి తీపి కబురు: పారితోషికం పెంపు.. జీవోలు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి (న్యూస్‌డెస్క్):
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల విధులు నిర్వహించే వివిధ కేటగిరీల ఉద్యోగుల పారితోషికాన్ని (Honorarium/Remuneration) సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సవరించిన నిబంధనలతో జీవో నంబర్లు 1345, 1346లను జారీ చేశారు.
నూతన ఉత్తర్వుల ప్రకారం, ఎన్నికల కేటగిరీల వారీగా సిబ్బందికి ఇచ్చే పారితోషికంలో మార్పులు చేశారు. అదేవిధంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలో ఏవైనా దురదృష్టకర ప్రమాదాలు లేదా అవాంఛనీయ సంఘటనలు జరిగి సిబ్బంది మరణించినా లేదా తీవ్రంగా గాయపడి వైకల్యం బారిన పడినా చెల్లించే పరిహారం (ఎక్స్-గ్రేషియా) మొత్తాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది సుదీర్ఘ వేళల్లో కష్టపడి పనిచేసే విధానాన్ని పరిగణనలోకి తీసుకుని వారి భద్రత మరియు ఆర్థిక లబ్ధి కోసం ఈ పెంపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.