ఉద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు
గుంటూరు, మేజర్‌న్యూస్ :
గత మూడు నాలుగు రోజులుగా ఉద్యోగ సర్వీస్ నుంచి డిస్మిస్ అయిన ఒక మాజీ ఉద్యోగ సంఘ నాయకుడు, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఏదో మేలు జరిగిపోయినట్లు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యోగులంతా వైసీపీకి మద్దతు ఇవ్వాలంటూ బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేయడం హాస్యాస్పదం, సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉంటూ ఉద్యోగుల సమస్యల కోసం పోరాడాల్సింది పోయి, వైసీపీ పంచన చేరి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిలా వ్యవహరించినందుకే ప్రభుత్వం ఆయన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది. అంతగా రాజకీయాలు చేయాలనుకుంటే 2024 ఎన్నికల ముందే వీఆర్ఎస్ తీసుకుని, అధికారికంగా వైసీపీలో చేరి పోటీ చేసి ఉంటే కనీసం ఒక రాజకీయ నాయకుడిగా గుర్తింపు ఉండేది. సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించి, ప్రభుత్వం చేత డిస్మిస్ కాబడిన వ్యక్తి ఇప్పుడు వైసీపీ తరపున మాట్లాడటానికి ఏ నైతికత ఉందో సమాధానం చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఎంతో మేలు చేసిందని, కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలనడం పచ్చి అబద్ధం. సొంత పత్రిక, సొంత టీవీ ఛానల్ ఉన్నాయి కదా అని నోటికొచ్చినట్లు ప్రచారం చేసుకుంటే వాస్తవాలు మారిపోవు. రాష్ట్రంలో ఒక్క ఉద్యోగి అయినా వైసీపీకి ఓటు వేసే పరిస్థితి ఉందా? ఉద్యోగుల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి వల్లే 2024 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల నుంచి సాధారణ ఓటింగ్ వరకు 95 శాతానికి పైగా ఉద్యోగులు వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారు. ఆ దెబ్బకే ఆ పార్టీ 11 సీట్లకు పరిమితమైంది. అధికారంలోకి రాకముందు అది చేస్తాం, ఇది చేస్తాం అని ఉద్యోగులను నిలువునా మోసం చేశారు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్ ను ఐదేళ్లయినా ఎందుకు రద్దు చేయలేదు? ఉద్యోగుల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కోతలు విధించి రివర్స్ పీఆర్సీ ఇచ్చి నట్టేట ముంచింది నిజం కాదా? ఉద్యోగులకు రావాల్సిన డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అలవెన్సులు అన్నీ ఎగ్గొట్టారు. ఉద్యోగులు తమ కష్టార్జితాన్ని దాచుకున్న జీపీఎఫ్ నిధులను సైతం దొంగచాటుగా దారిమళ్లించి వాడుకున్న ఇంతకంటే దారుణమైన పాలన మరొకటి ఉంటుందా? ఉద్యోగుల పొట్టకొట్టి, వారి హక్కులను కాలరాసిన వైసీపీ కోసం ప్రచారం చేయడానికి ఆ నాయకుడికి అసలు మానసిక విచక్షణ ఉందా అని అశోక్ బాబు ప్రశ్నించారు. ఉద్యోగులను సర్వనాశనం చేసిన వైసీపీని, వారి తొత్తులుగా మారిన ఇలాంటి వ్యక్తులను ఉద్యోగ సమాజం ఎప్పటికీ క్షమించదని, లోకల్ బాడీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఉద్యోగులు తగిన గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టం చేశారు.
ఉద్యోగుల సంక్షేమానికి టీడీపీ హయామే స్వర్ణయుగం.. జగన్ పాలనలో కోతలు, మోసాలే మిగిలాయి
ఉద్యోగుల హక్కులను కాలరాసి, వారి కష్టార్జితాన్ని దొంగిలించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా చూసుకున్న తెలుగుదేశం ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు స్పష్టం చేశారు. టీడీపీ పాలన ఉద్యోగుల చరిత్రలోనే ఒక స్వర్ణయుగమని ఆయన పేర్కొన్నారు. 2015లో రాష్ట్ర విభజన జరిగి ₹15,000 కోట్ల లోటు బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్ అల్లాడుతున్న సమయంలో కూడా ఉద్యోగుల ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు గారు కాపాడారు. ఉద్యోగుల విభజన ఇంకా పూర్తికాలేదు కాబట్టి, రెండు రాష్ట్రాల ఉద్యోగులకూ ఒకే విధంగా 43% పీఆర్సీ ఇవ్వాలని గట్టిగా కోరగానే, ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగులకు ఇచ్చిన మాటకు కట్టుబడి 43% ఫిట్మెంట్ అమలు చేశారు. విభజన వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి.. అమరావతికి వచ్చిన ఉద్యోగులందరికీ ఉచిత వసతి, ప్రత్యేక రైలు సౌకర్యం, కుటుంబాలను చూసుకోవడానికి వారానికి 5 రోజుల పనిదినాలు కల్పించి వెసులుబాటు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వమే. కక్ష సాధింపులు లేకుండా ఉద్యోగుల పట్ల పూర్తి సానుభూతితో వ్యవహరించిన చరిత్ర చంద్రబాబుది. ఆ రోజుల్లో వచ్చిన కొన్ని సమస్యలు వామపక్ష భావజాలం ఉన్న కొందరి స్వార్థ ఉద్యమాల వల్ల వచ్చినవే తప్ప, ప్రభుత్వపరంగా ఉద్యోగులకు ఏనాడూ అన్యాయం జరగలేదు. దేశంలోనే తొలిసారిగా సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ అమలు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతుంది. నాడు సీపీఎస్ ఉద్యోగి చనిపోతే ₹1,000 కూడా రాని పరిస్థితి నుంచి వారి కుటుంబాలకు అండగా నిలిచాం. హెచ్ఆర్ఏ పెంపు, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్, కాంట్రాక్ట్-ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సెలవులు, గ్రాట్యుటీ సహా ఉద్యోగులకు లబ్ధి చేకూరుస్తూ 60 నుంచి 65 కీలక జీవోలను ఇచ్చాం. అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన జగన్, ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా తన ఆర్థిక మంత్రితో 'రద్దు సాధ్యం కాదు' అని చేతులెత్తేయించారు. ఐదేళ్లలో ఏ రోజూ ఉద్యోగులతో ముఖాముఖి మాట్లాడిన పాపాన పోలేదు. ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్, పీఎఫ్ నిధులను ఏజీ ఆఫీస్ నుంచి అక్రమంగా దారిమళ్లించి వాడుకున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండేళ్లపాటు ఇవ్వకుండా వేధించారు. 2024 జూన్ నాటికి డీఏలు, సరెండర్ లీవ్‌లు, రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో ఉద్యోగులకు దాదాపు ₹38,000 కోట్ల నుంచి ₹40,000 కోట్ల వరకు బకాయిలు పెట్టి వెళ్లారు. వైసీపీ పెట్టిన కొండంత బకాయిల్లో ఇప్పటివరకు చంద్రబాబు గారి ప్రభుత్వం సుమారు ₹28,000 కోట్లను ఉద్యోగులకు చెల్లించి ఆదుకుంది. అంతేకాకుండా, గత ప్రభుత్వం నిధులు జమచేయక దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉన్న సీపీఎస్ ప్రభుత్వ కాంట్రిబ్యూషన్‌ను సరిదిద్దడానికి వెంటనే దాదాపు ₹5,000 కోట్లు జమ చేశాం. దీంతో నేడు ఉద్యోగుల సీపీఎస్ వాటా చెల్లింపుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఉద్యోగుల పొట్టకొట్టి నిధులు దోచుకున్న వైసీపీని, వారి తొత్తులుగా మారిన సంఘ నాయకులను ఉద్యోగ లోకం ఎప్పటికీ నమ్మదని, ఉద్యోగుల సంక్షేమం ఎల్లప్పుడూ తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని అశోక్ బాబు తేల్చిచెప్పారు.
చరిత్రలో ఎన్నడూ లేని రివర్స్ పీఆర్సీ ఇచ్చి, ఉద్యోగులను వేధించిన వైసీపీకి ఓటడగడానికి సిగ్గుండాలి
ఐదేళ్లపాటు ఉద్యోగులను అడుగడుగునా వంచించి, బెదిరింపులకు గురిచేసి, వేధింపులకు గురిచేసిన వైఎస్సార్సీపీ నాయకులు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఉద్యోగుల ఓట్లు అడుగుతున్నారని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రివర్స్ పీఆర్సీ ఇచ్చి, ఉద్యోగుల పొట్టకొట్టిన జగన్ ప్రభుత్వాన్ని ఏ ఒక్క ఉద్యోగి కూడా క్షమించరని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో 20% ఐఆర్ (ఇంటెరిమ్ రిలీఫ్) ఇస్తే, జగన్ గారు అధికారంలోకి రాగానే 27% ఐఆర్ ఇచ్చి ఉద్యోగులతో బ్రహ్మాండంగా ఉన్నారని జైకొట్టించుకున్నారు. తీరా అసలు పీఆర్సీ ఇచ్చేసరికి చేతులెత్తేసి దాన్ని 23 శాతానికి తగ్గించారు. అంటే చరిత్రలో ఎన్నడూ లేని ‘రివర్స్ పీఆర్సీ’ని ఉద్యోగుల నెత్తిన రుద్దారు. ఐఆర్ ఎక్కువ ఇచ్చి పీఆర్సీ తగ్గిస్తే రికవరీలు వస్తాయని తెలిసి, ఆ నెపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఐదు పెండింగ్ డీఏలను కలిపి ఏదో గొప్ప చేసినట్లు డ్రామా ఆడారు. కానీ ఉద్యోగులు, ముఖ్యంగా పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారన్న సత్యం అందరికీ తెలుసు. జగన్ పాలనలో ఉద్యోగ సంఘాలకు కనీస గౌరవం లేకపోయింది. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అస్సలు దొరకదు; ఏ సమస్య వచ్చినా ‘ఆల్ డిపార్ట్మెంట్స్ మినిస్టర్’ సజ్జల గారి దగ్గరకు వెళ్లమనేవారు. ఆయన్ను కలవడానికే ఉద్యోగ సంఘ నాయకులకు నెలల తరబడి సమయం పట్టేది. తమకు అనుకూలమైన సంఘాలతో మాత్రమే రహస్య రాయబారాలు నడిపి, మిగిలిన నాయకులను బెదిరించి, లొంగదీసుకుని బలవంతంగా ఈ రివర్స్ పీఆర్సీని రుద్దారు. ఆ అన్యాయంపై విజయవాడ సూర్యారావుపేట రోడ్లలో ఉద్యోగులు కదం తొక్కిన చారిత్రాత్మక పోరాటమే జగన్ ప్రభుత్వంపై ఉద్యోగ వర్గాల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు ప్రత్యక్ష నిదర్శనం. న్యాయమైన హక్కుల కోసం ఉద్యమాల్లో పాల్గొంటే కేసులు పెట్టారు, డిసిప్లినరీ చర్యలు తీసుకున్నారు. తమ వాళ్లయితే ఒక న్యాయం, కాకపోతే మరో న్యాయం అన్నట్లుగా వ్యవహరించారు. భరించలేక ఎంతోమంది నిజాయితీపరులైన అధికారులు సెలవులపై వెళ్లిపోయారు; పోలీసులను వీఆర్ లకు పంపారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సైతం పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పడేశారు. ఉద్యోగులను ఇంతలా వేధించిన పాపాన్ని ఎవరూ మర్చిపోలేదు. ఆ కక్షతోనే 2024 ఎన్నికల్లో ఉద్యోగ సమాజం ఒక్కటై వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఉద్యోగులు, పెన్షనర్ల వద్ద నుంచి ప్రతినెలా హెల్త్ స్కీమ్ కోసం క్రమం తప్పకుండా డబ్బులు వసూలు చేసి.. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు మాత్రం బిల్లులు చెల్లించకుండా ఎగ్గొట్టారు. దీంతో జబ్బు చేసి ఆసుపత్రులకు వెళ్తే అడ్మిషన్ ఇవ్వక, చేర్చుకోక వేలాది మంది పెన్షనర్లు, ఉద్యోగులు నరకయాతన అనుభవించారు. చివరికి రీయింబర్స్మెంట్లు కూడా రాక కన్నీళ్లు పెట్టుకున్న దుస్థితి జగన్ పాలనలోనే చూశాం. మహిళా ఉద్యోగుల సంక్షేమం నుంచి అన్ని వర్గాల ప్రయోజనాలను నాశనం చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి హక్కును, ఆర్థిక ప్రయోజనాన్ని ఒక్కొక్కటిగా లాక్కున్న చరిత్ర జగన్‌ది. అలాంటి పార్టీకి ఇప్పుడు ఉద్యోగులు ఎందుకు ఓటెయ్యాలి? జగన్ రెడ్డి పుట్టినరోజు వస్తే మేక తలకాయలు కోసి రక్తంతో ఫ్లెక్సీలకు తర్పణం చేసే ఉన్మాద తత్వం, కుల-ప్రాంతీయ పిచ్చి ఉన్న ఒక 2-3 శాతం మంది తప్ప.. ఆత్మాభిమానం, విజ్ఞత ఉన్న ఏ ఒక్క ఉద్యోగి కూడా వైసీపీ వైపు కన్నెత్తి చూసే ప్రసక్తే లేదు. సర్వీస్ నుంచి డిస్మిస్ అయిన నేతలు చిలక పలుకులు పలికినా ఉద్యోగ లోకం నమ్మదని, రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ వైసీపీని ఉద్యోగులు పూర్తిగా తిరస్కరిస్తారని అశోక్ బాబు హెచ్చరించారు.
ఉపాధ్యాయుల గౌరవాన్ని కాలరాసి, ఉద్యోగుల సొమ్మును దోచేసిన వైసీపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు
గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిని కించపరిచి, నిరుద్యోగులను మోసం చేసి, ఉద్యోగుల కష్టార్జితాన్ని దొంగిలించిన వైఎస్సార్సీపీ నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఉద్యోగులను ఓట్లు అడుగుతున్నారని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల అరాచక పాలనపై ఉద్యోగ, ఉపాధ్యాయ లోకానికి ఉన్న అసహ్యం మాటల్లో చెప్పలేనిదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన, గౌరవప్రదమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అలాంటి ఉపాధ్యాయులతో ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా తీయకపోగా, వారిని మద్యం దుకాణాల (వైన్ షాపుల) ముందు నిలబెట్టి క్యూలైన్లను అజమాయిషీ చేయించిన హీనమైన చరిత్ర జగన్ ప్రభుత్వానిది. విద్యాబుద్ధులు నేర్పే గురువులను ఇలా రోడ్లమీద అవమానించిన సంఘటనను దేశ చరిత్రలో ఎవరూ చూడలేదు. పార్టీ స్వార్థం కోసం కార్యకర్తలను వాలంటీర్లుగా మార్చి, నెలకు ₹5,000 ఇస్తూ వారి చేత పార్టీ పనులు చేయించుకున్నారు. 'జగన్‌కు ఓటేస్తేనే పథకాలు వస్తాయి, లేకపోతే రావు' అని ప్రతి 50 కుటుంబాలపై నిఘా పెట్టి, ప్రజలను బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేశారు. చివరికి ఆ రెండు లక్షల మంది వాలంటీర్లను కూడా రెన్యూవల్ చేయకుండా నట్టేట ముంచి పారిపోయారు. అందుకే నేడు వాలంటీర్ వ్యవస్థ రద్దయినా ప్రజలు బాధపడటం లేదు; నిఘా, బెదిరింపుల నుంచి స్వేచ్ఛాయుతమైన వాతావరణం వచ్చిందని ఊపిరి పీల్చుకుంటున్నారు. 1985 నుంచి నేటివరకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న దాదాపు 2 లక్షల మంది ఉపాధ్యాయులను రిక్రూట్ చేసిన ఘనత ముమ్మాటికీ తెలుగుదేశం ప్రభుత్వానిదే (ఒక్క రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో తప్ప మిగిలినవన్నీ టీడీపీ పాలనలోనే జరిగాయి). ఐదేళ్లపాటు ఒక్క ఉద్యోగం ఇవ్వని జగన్, ఇప్పుడు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టగానే 16,000 పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి పెండింగ్‌లో పెట్టిన 6,000 కానిస్టేబుల్ పోస్టులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడమే కాకుండా, వారి స్టైఫండ్‌ను కూడా పెంచి నిరుద్యోగులకు అండగా నిలిచారు. ఉద్యోగుల పనిభారం తగ్గించేందుకు వార్షిక జాబ్ క్యాలెండర్‌పై ప్రభుత్వం పనిచేస్తోంది. ఉద్యోగుల వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది ఉద్యోగులపై ప్రేమతో కాదు.. తన హయాంలో ఎవరూ రిటైర్ కాకూడదు, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వకూడదనే దుర్బుద్ధితోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తీరా రిటైర్మెంట్లు మొదలయ్యాక, ఒక్కొక్కరికీ రావాల్సిన ₹25 నుంచి ₹30 లక్షల ప్రయోజనాలను రెండేళ్లపాటు ఇవ్వకుండా తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ తక్షణమే లబ్ధి చేకూరుస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్లు ప్రతినెలా ₹300 నుంచి ₹450 వరకు ప్రీమియం కడుతున్నప్పటికీ, ఆ సొమ్మును ప్రభుత్వం దారిమళ్లించి ఆసుపత్రులకు ₹3,000 కోట్ల బకాయిలు పెట్టింది. దీంతో ఆసుపత్రులు హెల్త్ కార్డులను నిలిపివేసి, వేలాది మంది పెన్షనర్లు వైద్యం అందక నానా అవస్థలు పడ్డారు. ఎంప్లాయిస్ డబ్బే కాదు.. డ్వాక్రా మహిళల నిధులు, కార్మికుల వెల్ఫేర్ ఫండ్స్, యూనివర్సిటీల నిధులు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, చివరికి గ్రామ పంచాయతీ ఫండ్స్‌ను కూడా జగన్ వాడేసుకున్నారు. ఫలితంగా గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లలేని, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. తమను గెలిపించిన ఉద్యోగ వర్గాలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తోంది. సీపీఎస్ ఉద్యోగుల ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ నిధులను వెంటనే జమ చేశాం. ఉద్యోగులకు రావాల్సిన రెండు డీఏ (DA)లను విడుదల చేశాం. రిటైర్ అయిన ఉద్యోగులకు సకాలంలో బెనిఫిట్స్ అందజేస్తున్నాం. ఉద్యోగులు కడుతున్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం నిధులను వెంటనే ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు బదిలీ చేసి, ఆసుపత్రులకు బకాయిలు లేకుండా సకాలంలో నగదు రహిత నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల గౌరవాన్ని కాలరాసి, ఆర్థికంగా దివాళా తీయించిన వైసీపీ నేరపూరిత పాలనను ఉద్యోగ, ఉపాధ్యాయ సమాజం ఎప్పటికీ క్షమించదని అశోక్ బాబు హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీకి ఉద్యోగులు గట్టి బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన తేల్చిచెప్పారు.
పీఆర్సీ కమిషన్‌కు కనీసం కుర్చీ కూడా వేయని వైసీపీ నేతలకు ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉద్యోగులకు ఐదేళ్లకోసారి పీఆర్సీ ఇచ్చే గొప్ప సంప్రదాయం ఉందని, అటువంటి వ్యవస్థను జగన్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 11వ పీఆర్సీని రివర్స్ పీఆర్సీగా మార్చి, 12వ పీఆర్సీ కమిషన్‌కు కనీసం ఆఫీసు గది, టేబుల్, కుర్చీ కూడా ఇవ్వకపోవడంతో ఆ కమిషనర్ రాజీనామా చేసి వెళ్లిపోయినంత దౌర్భాగ్యపు పాలనను ఉద్యోగులు జగన్ హయాంలో చూశారని ఆయన మండిపడ్డారు. సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించి ఓట్లు వేయించుకున్న జగన్.. తీరా అధికారంలోకి వచ్చాక 'తూచ్.. రద్దు చేయలేం' అంటూ కేంద్రానికి మాట ఇచ్చాననే నెపంతో ఉద్యోగులపై జీపీఎస్ (GPS)ను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేశారు. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం రాగానే ఆ జీపీఎస్‌ను పక్కనబెట్టి అబయన్స్‌లో ఉంచింది. జగన్ ఐదేళ్ల పాలనలో 60 నెలలకు గాను కనీసం నాలుగైదు నెలలు కూడా ఒకటో తారీఖున జీతాలు ఇచ్చిన పాపాన పోలేదు. 5, 8, 10వ తేదీల వరకు జీతాలు రాక ఈఎంఐలు, బ్యాంక్ లోన్ వాయిదాలు చెల్లించలేక ఉద్యోగులు పెనాల్టీలు కట్టి తీవ్ర మనోవేదన అనుభవించారు. నేడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో చిన్న క్లాస్ ఫోర్ ఉద్యోగి, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది నుంచి చీఫ్ సెక్రెటరీ వరకు, అలాగే పెన్షనర్లకు సైతం ఒకటో తారీఖునే ఠంచనుగా జీతాలు, పెన్షన్లు అందుతున్నాయి. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సెలవులు, గ్రాట్యుటీ హక్కులను కల్పించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. 1985 నుంచి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఏ రోజూ ఉద్యోగులకు నష్టం చేసే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా పని చేయమంటారు తప్ప ఎవరి హక్కులనూ కాలరాయలేదు. కానీ జగన్ పాలనలో ఉద్యోగులకు మిగిలింది కష్టాలు, అక్రమ కేసులు, ఆర్థిక నష్టాలే. పని ఒత్తిడితో పాటు, హక్కుల కోసం ఉద్యమం చేస్తే కేసులు పెట్టి వేధించారు, జీతభత్యాల్లో తీవ్ర కోతలు విధించారు. వైసీపీకి తొత్తులుగా మారిన రిటైర్డ్, డిస్మిస్డ్ సంఘ నాయకులకు వైసీపీ ప్రభుత్వంపై అంత ప్రేమే ఉంటే.. బహిరంగ చర్చకు రావాలని అశోక్ బాబు సవాల్ విసిరారు. మీ సాక్షి టీవీలోనే కూర్చుందాం.. జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలు మీరు తీసుకురండి, 2014 నుంచి నేటివరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేస్తూ ఇచ్చిన జీవోలను నేను తీసుకొస్తా. మీరు చెప్పిన ఛానల్‌కైనా సరే, మేం చెప్పే ఛానల్‌కైనా సరే చర్చకు రావాలి. మైకులు, సొంత పత్రికలు ఉన్నాయని ఉద్యోగులకు ఏదో ఉద్ధరించినట్లు మాట్లాడితే ఎవరూ నమ్మరని తేల్చిచెప్పారు. గతంలో జేఏసీ చైర్మన్‌గా పనిచేసిన అనుభవంతో రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని, ఏ ప్రభుత్వంలో ఉద్యోగుల గౌరవం నిలబడింది, ఎవరి హయాంలో ఆర్థిక భరోసా దక్కిందో నిష్పక్షపాతంగా ఆలోచించాలని అశోక్ బాబు కోరారు. కుహనా రాజకీయాలు చేసే వైసీపీ నాయకులను తిరస్కరించి, ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు