నర్కూడలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు
నియంత్రణ తప్పి కాలువలోకి దూసుకెళ్లి చెట్టు మొద్దును ఢీకొన్న ఇన్నోవా కారు
శంషాబాద్ మండల పరిధిలోని నర్కూడ గ్రామంలో తూర్పాటి ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నర్కూడ గ్రామానికి చెందిన టి. పాండు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు.స్థానికుల కథనం ప్రకారం.. శంషాబాద్ వైపు నుంచి నర్కూడ గ్రామం వైపు వస్తున్న ఇన్నోవా కారు, తన ముందు వెళ్తున్న మరో కారును తప్పించబోయి అదుపు తప్పింది. దీంతో రహదారి పక్కన నీటి పైపు పనుల కోసం తవ్విన కాలువలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. అనంతరం అక్కడే ఉన్న చెట్టు మొద్దును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న పాండుకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.ప్రమాద సమయంలో కారు స్టీరింగ్‌ను బలంగా ఢీకొన్నట్లు ప్రత్యక్షంగా చూసిన స్థానికులు తెలిపారు. కారు ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం నుంచి కొంతమేర రక్షణ లభించినట్లు వారు పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
పోతుల నర్సింహా, మేజర్ న్యూస్- శంషాబాద్.