మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: చదువు పూర్తిచేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 31న ఎల్లంపేటలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపడుతున్న ఈ కార్యక్రమానికి ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ సహకారం అందిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం. రాధిక ఒక ప్రకటనలో తెలిపారు.జాబ్ మేళా ఈ నెల 31వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎల్లంపేటలోని సోను ఫంక్షన్ హాల్‌లో జరగనుంది. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 14 గ్రామాల యువతీ, యువకులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ మేళాలో లులు గ్రూప్, అపోలో ఫార్మసీ, టెక్ మహీంద్రా, కేవా గ్రూప్, రీకాన్, ష్నైడర్ తదితర 10కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి.ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలు, బయోడేటా, ఆధార్ కార్డుతో నేరుగా జాబ్ మేళాకు హాజరుకావాలని అధికారులు సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలని నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. జాబ్ మేళాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9866465024, 7842617596 నంబర్లను సంప్రదించాలని జిల్లా ఉపాధి కార్యాలయ అధికారులు తెలిపారు.