నాలా’ పేరుతో రియల్టర్ల మాయాజాలం
సూర్య - పెద్దపల్లి :
పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ 2వ వార్డు,రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 518/4, 519లలో డీటీసీపీ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ వెంచర్‌ను తక్షణమే నిలిపివేయాలని,అమాయక ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎన్‌ఎస్‌యూఐ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బండారి సునీల్ గౌడ్ జిల్లా కలెక్టర్‌ను కోరారు.సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన కలెక్టరేట్ పరిపాలన అధికారికి లిఖితపూర్వక వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సునీల్ గౌడ్ మాట్లాడుతూ సదరు సర్వే నెంబర్లలోని భూములు భూభారతి పోర్టల్‌లో ఇప్పటికీ వ్యవసాయ భూములుగానే నమోదై ఉన్నాయని,కేవలం నాలా ప్రక్రియ నడుస్తుండగానే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు,భూ యజమానులు డీటీసీపీ లేదా మున్సిపాలిటీ అనుమతులు లేకుండా అక్రమంగా లేఅవుట్ చేస్తున్నారని ఆరోపించారు.మున్సిపల్ నిబంధనల ప్రకారం ప్రజా అవసరాల కోసం కేటాయించాల్సిన 10 శాతం భూమిని మున్సిపాలిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయకుండా,రేరా నిబంధనలను సైతం ఉల్లంఘిస్తూ రోడ్లు,కాంపౌండ్ వాల్ నిర్మించి ప్లాట్లు అమ్ముతున్నారని మండిపడ్డారు.డీటీసీపీ లేని ప్లాట్లను నాలా ఆధారంగా కొనుగోలు చేస్తే భవిష్యత్తులో భవన నిర్మాణ అనుమతులు రావని,ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఈ అక్రమ వెంచర్‌పై పూర్తిస్థాయి విచారణ జరిపించి,రెవెన్యూ అధికారుల ద్వారా నాలా ప్రక్రియను,సబ్ రిజిస్ట్రార్ ద్వారా ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.అలాగే మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని,10 శాతం భూమిని పురపాలక సంఘం పేరిట బదలాయించేలా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్‌ను వేడుకున్నారు.