చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగానికి రూ.1.30 లక్షల విలువైన వైద్య పరికరాల వితరణ ఎడ్లూరి ప్రభాకరరావు దంపతుల సేవాభినందనీయం – డాక్టర్ చలపతి
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : నగరంలోని సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల విభాగంలో శస్త్రచికిత్సల నిర్వహణకు అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో లేవని తెలుసుకున్న ఎడ్లూరి ప్రభాకరరావు దంపతులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో సుమారు రూ.1,30,000 విలువైన శస్త్రచికిత్సలకు అవసరమైన వైద్య పరికరాలను కొనుగోలు చేసి ఆసుపత్రికి అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ చలపతి మాట్లాడుతూ, చిన్నపిల్లలకు శస్త్రచికిత్సలు నిర్వహించే సమయంలో ఈ వైద్య పరికరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. వీటి అందుబాటుతో వైద్యులకు మరింత సౌలభ్యం కలగడమే కాకుండా, అవసరమైన చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
సమాజంలో సేవాభావంతో ముందుకొచ్చి, ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాలను అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ మంచి కార్యక్రమానికి సహకరించి విలువైన వైద్య పరికరాలను అందించిన ఎడ్లూరి ప్రభాకరరావు దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకారం అందించిన ఆలంబన జనార్దన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ చలపతి, డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ స్వాతి, డాక్టర్ జగదీష్, డాక్టర్ గంగాధర్, డాక్టర్ షెలియా, దాతలు డాక్టర్ ఎడ్లూరి ప్రభాకరరావు దంపతులు, ఆలంబన జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాల మెరుగుదలకు దాతలు, సేవా సంస్థలు ముందుకు రావడం ద్వారా పేద మరియు సామాన్య ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్.