మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్లు మంత్రి పొన్నం ప్రభాకర్
కోకాపేటలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కల్చరల్ సెంటర్లో ధన్యవాదాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించిందని, నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేసుకోవాలని సూచించారు. అవసరమైతే అదనపు నిధులు కేటాయించేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని తెలిపారు.
కులాభివృద్ధికి ఉన్నత స్థాయిలో ఉన్నవారు సహకరించాలి
కులంలో ఐక్యత ఎంతో ముఖ్యమని, ఉన్నత స్థాయికి ఎదిగిన వారు తమ సామాజిక వర్గ అభివృద్ధికి సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. కులంలో రాజకీయ చైతన్యం పెరగాలని, అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. గతంలో తాను వేములవాడకు వెళ్లినప్పుడు మున్నూరు కాపు సత్రంలోనే బస చేసేవాడినని గుర్తుచేశారు.
దాతల సహకారంతో వేములవాడలో 40 ఏసీ గదులతో గౌడ సత్రాన్ని నిర్మించామని, అది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. అదేవిధంగా మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనాన్ని కూడా త్వరగా నిర్మించుకుని సామాజిక వర్గ ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
యువతకు నైపుణ్య శిక్షణ.. ఉపాధికి ప్రత్యేక కార్యాచరణ
మున్నూరు కాపు కార్పొరేషన్ ద్వారా యువతకు వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించే కార్యక్రమాలను రూపొందిస్తామని మంత్రి తెలిపారు. స్వయం ఉపాధికి అవసరమైన శిక్షణ అందించి యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తామని వెల్లడించారు. త్వరలో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం కానుందని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తుల్లోనూ మార్పులు రావాలని, యువత ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆర్థికంగా ఎదిగే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
విద్యతోనే ఆర్థిక అభివృద్ధి
రాష్ట్రంలో కులగణన నిర్వహించామని, వివిధ సామాజిక వర్గాల జనాభాకు సంబంధించిన ప్రామాణిక గణాంకాలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కుల సర్వే నివేదిక ఆధారంగా ఉన్నత స్థాయికి ఎదిగిన కుటుంబాల పరిస్థితులను పరిశీలిస్తే, ఉన్నత విద్యను అభ్యసించిన కుటుంబాలు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నట్లు గుర్తించామని వివరించారు. గుజరాత్లోని పాటిదార్ భవన్లో యువతకు నాణ్యమైన శిక్షణ అందించి ఉద్యోగాలు పొందేలా చేస్తున్నారని ఉదహరించారు. తెలంగాణలోనూ బీసీ స్టడీ సర్కిళ్లలో సంస్కరణలు చేపడుతున్నామని, బీసీ వర్గాల తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన శిక్షణ ఇప్పించి పోటీ పరీక్షలు, ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేయాలని కోరారు.
ముఖ్యమంత్రి చెప్పినట్లుగా గతంలో మాదిరిగా ప్రజలకు భూములు, ఆర్థిక వనరులు సమకూర్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదని, భవిష్యత్తుకు ఉపయోగపడే అత్యంత విలువైన పెట్టుబడి విద్యేనని మంత్రి పేర్కొన్నారు. విద్య ద్వారా యువత జీవితాల్లో శాశ్వతమైన మార్పు తీసుకురావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలు గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, వినయ్ కుమార్, బొంతు రామ్మోహన్, గాలి అనిల్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఎ.రవీందర్ సూర్య తెలంగాణ బ్యూరో ప్రతినిధి