telangana
మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థినులకు అవగాహన
సూర్య.నేరడిగొండ: మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా భీమవరం నుంచి ఢిల్లీ వరకు చేపట్టిన నషా ముక్త్ భారత్ అవగాహన యాత్రలో భాగంగా నేరడిగొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఇమ్రాన్, కేజీబీవీ ప్రత్యేకాధికారి రజిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై ఇమ్రాన్ విద్యార్థినులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వాటి ప్రభావంతో ఆరోగ్యం, భవిష్యత్తు ఎలా దెబ్బతింటాయో వివరించారు. విద్యార్థి దశ నుంచే చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. ఇందుకూరి విజయలక్ష్మి మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలపై అవగాహనను కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా తెలియజేయాలని విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేకాధికారి రజిత, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.