ఆత్మకూరులో భక్తిశ్రద్ధలతో వరుణ హోమం – రైతులను ఆదుకోవాలని వరుణ దేవునికి ప్రత్యేక పూజలు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణంలో విస్తారంగా వర్షాలు కురిసి, రైతులు సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలతో గ్రామం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షిస్తూ నవంబర్ వరుణ దేవునికి భక్తిశ్రద్ధలతో వరుణ హోమం నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు పట్టణ నడిబొడ్డున ఉన్న అంకమ్మ సెంటర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అందంగా అలంకరించిన ట్రాక్టర్‌పై ఊరేగింపుగా ఆత్మకూరు చెరువు వద్దకు తీసుకెళ్లడం జరిగింది. ఈ ఊరేగింపులో రైతులు, భక్తులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొనగా, తప్పెట్లు, తాళాలు, బాణసంచా, మంగళవాయిద్యాల నడుమ భక్తి వాతావరణం నెలకొంది.అనంతరం ఆత్మకూరు చెరువు వద్ద శాస్త్రోక్తంగా వరుణ హోమం నిర్వహించగా మున్సిపల్ చైర్మన్ గా ఇటీవల విజయం సాధించిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా, ఆమె తనయుడు, యువనేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి,నిత్య అన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి, సీనియర్ బిజెపి నాయకుడు కుడుముల సుధాకర్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు, రైతులు, భక్తులు కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పవిత్ర మహానంది క్షేత్రం నుంచి తీసుకువచ్చిన పుణ్యజలాలకు చెరువు తూము వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆ పవిత్ర జలాలను తూములో పోయడం జరిగింది. తదనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.వర్షాలు లేని సమయంలో వరుణ దేవుని ప్రార్థిస్తూ ఆత్మకూరు గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో నిర్వహించుకునే ఈ సంప్రదాయ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో జరగడం విశేషం. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన నిర్వాహకులను రైతులు, గ్రామ పెద్దలు, భక్తులు అభినందించారు.
వరుణ దేవుని కృపాకటాక్షాలతో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులు సుఖసంతోషాలతో పాడిపంటలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు .