లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సైబర్ నేరాలపై చందానగర్ పోలీసుల అవగాహన
చందానగర్,మేజర్ న్యూస్ : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని పలువురు చందానగర్ సిఐ శ్రీధర్ సూచించారు.ఈ మేరకు లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు, ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు చందానగర్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలు, నకిలీ పోలీసు ఫోన్ కాల్స్, ఓటీపీ, ఏటీఎం పిన్, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలను అపరిచితులకు వెల్లడించకూడదని అవగాహన కల్పించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం, గుర్తుతెలియని వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం చేయరాదని సూచించారు. నకిలీ పెట్టుబడులు, ఉద్యోగాలు, రుణాలు, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.అంతేకాకుండా అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, బెదిరింపు ఫోన్ కాల్స్ లేదా సందేశాలకు భయపడి డబ్బులు బదిలీ చేయవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని వివరించారు.ఈ కార్యక్రమంలో డీఐ నవీన్, ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ సైదయ్య, స్టేషన్ మాస్టర్ రాజు, సీసీఐ స్వామి, జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ నర్సింగ్ రాథోడ్, సైబర్ వారియర్ నర్సమ్మతో పాటు పోలీసు, రైల్వే సిబ్బంది, పలువురు ప్రయాణికులు పాల్గొన్నారు.సైబర్ నేరాల నియంత్రణకు పోలీసు, ఆర్పీఎఫ్, జీఆర్పీ, రైల్వే శాఖల సమన్వయంతో పాటు ప్రజల్లో అవగాహన ఎంతో అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతపై అవగాహన పెంచుకుని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా తెలియజేయాలని పిలుపునిచ్చారు.