కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా దీపావళి వేడుకలు
పటాన్ చెరు మేజర్ న్యూస్ : కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో దీపావళి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. రంగురంగుల అలంకరణలు, అందమైన రంగవల్లులు, దీపాల తయారీతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.
విద్యార్థులు స్వయంగా తయారుచేసిన దీపావళి శుభాకాంక్షల కార్డులు, వివిధ రకాల కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు దీపాల ఆకృతిలో వరుసగా కూర్చొని నిర్వహించిన కార్యక్రమం చూపరులను ఆకట్టుకుంది. అదేవిధంగా విద్యార్థినులు సంప్రదాయ పద్ధతిలో రంగవల్లులు తీర్చిదిద్ది పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీహెచ్. రాజేష్ మాట్లాడుతూ.. దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపే పండుగ అని తెలిపారు. విద్యార్థులకు పండుగల ప్రాముఖ్యత, మన సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించారు.విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాలలో దీపావళి వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.