కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలి
సూర్య, సెంటినరీకాలనీ : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో రామగుండం ఏరియా-2 మహాకవి పోతన కాలనీలోని గోదావరి కళ్యాణ మండపంలో నిర్వహించనున్న కోల్ ఇండియా స్థాయి బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ఘనంగా నిర్వహించాలని జీఎం (పర్సనల్) వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్ కె. అజయ్ కుమార్ అధికారులకు సూచించారు. ఈ పోటీల ఏర్పాట్లపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అజయ్ కుమార్కు ఏరియా జనరల్ మేనేజర్ తాళ్లపల్లి లక్ష్మిపతి గౌడ్, అధికారులు సాదర స్వాగతం పలికి శాలువాతో సన్మానించి మొక్కను బహుకరించారు. అనంతరం పోటీలు నిర్వహించే గోదావరి కళ్యాణ మండపాన్ని అజయ్ కుమార్ సందర్శించి వేదిక, స్టేజీ, లైటింగ్, సౌండ్, ప్రేక్షకుల సీటింగ్, క్రీడాకారుల విశ్రాంతి గదులు, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. తదుపరి వివిధ విభాగాల అధిపతులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పోటీల నిర్వహణ, క్రీడాకారులకు వసతి, భోజన సౌకర్యాలు, వైద్య సేవలు, రవాణా, ఆహ్వానితుల ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ కోల్ కంపెనీల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నందున అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు. క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, సింగరేణి సంస్థ ఖ్యాతి మరింత ఇనుమడించేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) బి. శివకేశవులు, డీజీఎం (ఎఫ్ అండ్ ఏ) వెంకట్ రాంచంద్ర, మెడికల్ సూపరింటెండెంట్ డా. మహిపాల్, రెస్క్యూ సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ షరీఫ్ మహమ్మద్, ఎస్ఈ సివిల్ బాలరాజు, డీవైఎస్ఈ అరవింద్ కుమార్, పర్సనల్ హెచ్ఓడీ ఎన్. వేణుగోపాల్, డీవై పీఎం సునీల్ ప్రసాద్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్లు సింగ్ శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, ఐటీ సీనియర్ ప్రోగ్రామర్ అశ్విని, స్పోర్ట్స్ సూపర్వైజర్లు నరేందర్ రెడ్డి, పాసినెట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.