సూర్య, హుజురాబాద్:ఈనెల 29వ ఆదివారం అల్గునూర్ లో జరిగే దీక్ష దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శుక్రవారం రాత్రి హుజురాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు వీధుల్లో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పోస్టర్లు అతికించి ప్రచారం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టమని అన్నారు. కేసీఆర్ పోరాట పటిమ, పట్టుదల, త్యాగనిరతితో తెలంగాణ ఉద్యమం కీలక మలుపు తిరిగి ప్రత్యేక రాష్ట్ర సాధనకు మార్గం సుగమమైందని అన్నారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాన్ని, అమరుల త్యాగాలను, కేసీఆర్ పోరాటాన్ని నేటి తరానికి గుర్తుచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దీక్షా దివస్ అనేది కేవలం ఒక కార్యక్రమం కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రజల ఆకాంక్షలకు ప్రతీక అని అన్నారు. నవంబర్ 29న కరీంనగర్‌లో నిర్వహించనున్న దీక్షా దివస్ సభకు హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి పట్టణం నుంచి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి సభకు భారీ జనసమీకరణ చేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి కరీంనగర్ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, ఇరుమల్ల సురేందర్ రెడ్డి, సర్పంచ్ మల్లారెడ్డి, కౌన్సిలర్ రవీందర్ రావు, మహిళా నాయకురాలు కేసిరెడ్డి లావణ్య, మారేపల్లి సుశీల, పావని గౌడ్, కోహెడ శ్రీదేవి, ఎల్లయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.