BREAKING
కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలి బంగారం కోసం వృద్ధురాలి హత్య కేసు... -- ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మంత్రి శ్రీధర్ బాబు సర్పంచ్ అభ్యర్థులతో పోలీసుల ఎన్నికల అవగాహన సమావేశం ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణ గిజబ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మరడాన ఉషారాణి

మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం..

Select Suryaa Now
మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం..


- బరిలో 8 మంది!
-  కూటమి నుంచి ముగ్గురు అభ్యర్థులు.. 
- వైసీపీ, స్వతంత్రుల నుంచి గట్టి పోటీ.
-  ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల పాట్లు.. 
- సోషల్ మీడియా ప్రచారంపై ప్రజల్లో అసహనం.

నరసన్నపేట నవంబర్ 27 మేజర్ న్యూస్:

నరసన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల పోరు రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో సర్పంచ్ పదవికి మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార కూటమి తరఫున ముగ్గురు అభ్యర్థులు పోటీలో కొనసాగుతుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉండటంతో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది.

అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎవరికి అనుకూలంగా ఓట్లు చీలుతాయి? ఎవరికి రాజకీయంగా నష్టం జరుగుతుంది? అన్న చర్చలు పట్టణంలో జోరందుకున్నాయి. ప్రధాన పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ విజయమే లక్ష్యంగా ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులు అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించడంతో ప్రచారంలో మరింత వేగం పెరిగింది.

సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులు సైతం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు హామీలు గుప్పిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ఖర్చు కూడా అంచనాలకు మించి పెరిగే అవకాశముందని, కోట్ల రూపాయల వ్యయం చుట్టూ పట్టణంలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

*సోషల్ మీడియా ప్రచారంపై ప్రజల్లో అసహనం!*

మరోవైపు నరసన్నపేట సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న కొంతమంది అభ్యర్థులు సోషల్ మీడియాను ప్రచార వేదికగా విస్తృతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో రోజుకు వేల సంఖ్యలో ఏఐ ఆధారిత ఫొటోలు, వీడియోలు, ప్రచార సందేశాలను పోస్టు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు పెయిడ్ ప్రచారకర్తల ద్వారా కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.

అయితే ఈ తరహా ప్రచారం ప్రజలకు తలనొప్పిగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విపరీతంగా వస్తున్న మెసేజీలు, వీడియోలతో విసిగిపోయిన కొంతమంది వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలుగుతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ప్రచార హోరుతో ప్రజల్లో అసహనం పెరుగుతోందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

సోషల్ మీడియా ప్రచారం ద్వారా ప్రజలకు చేరువ కావాలనుకుంటున్న అభ్యర్థులు, అదే ప్రచారం తమకు ప్రతికూలంగా మారే ప్రమాదాన్ని గుర్తించాలని పలువురు సూచిస్తున్నారు. ప్రచారం పేరుతో పదేపదే వేలాది సందేశాలు పంపడం వల్ల సానుకూలత కంటే వ్యతిరేకతే పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ప్రజల వ్యక్తిగత సమయాన్ని, మానసిక ప్రశాంతతను గౌరవిస్తూ అభ్యర్థులు ప్రచార పద్ధతులను మార్చుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సాగించే ప్రచారం హద్దులు దాటితే మొదటికే మోసం వస్తుందని, ప్రజల అభిమానం పొందాలంటే హడావుడి ప్రచారం కంటే అభివృద్ధి పట్ల స్పష్టమైన దృక్పథం, ప్రజలకు అందుబాటులో ఉండే స్వభావం ముఖ్యమని హితవు పలుకుతున్నారు.

మొత్తంగా ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో నరసన్నపేట మేజర్ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఓట్ల చీలిక ఎవరికి లాభిస్తుంది? ప్రజలు ఎవరికి పట్టం కడతారు? అన్నది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.