telangana
గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
సూర్య, హుజురాబాద్:గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ ఇచ్చిన నిధులతోనే హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణ శివారులోని కేసి క్యాంపు లో గల తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... హుజురాబాద్ నియోజకవర్గంలో నాటి సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు మంజూరు చేయగా అనేక అభివృద్ధి పనులు జరిగినట్లు ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో తన కుమార్తె కేసిఆర్ తాత నుండి 1000 కోట్లు తీసుకుని మా నాన్న వస్తారని చెప్పిన మాట వాస్తవమేనని, కానీ సీఎం గా కేసీఆర్ లేకపోవడం వల్ల నిధులు తేలేకపోయానని అన్నారు. 2028లో జరిగే ఎన్నికల్లో తిరిగి విజయం సాధించి సీఎం కేసీఆర్ నుండి మరిన్ని నిధులు మంజూరు చేయించుకొని హుజురాబాద్ నియోజకవర్గంను గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట లకు పోటీగా అభివృద్ధి చేస్తానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. తాను 15 సంవత్సరాలుగా హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉండి తాను కిరాయికి ఉండే ఇంటికి వెళ్లే రోడ్డును సైతం వేయ లేదని, తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనే ఆ రోడ్డు వేసిన సంగతి ప్రజలకు తెలుసన్నారు. తన కుమారుడు కాంట్రాక్టర్ గా ఉంచి రోడ్లు వేయించిన సంగతి హుజురాబాద్ ప్రజలకు తెలుసని అన్నారు. ఈటల సొంత గ్రామం కమలాపూర్ లో బస్టాండ్ కూడా నిర్మించుకోలేకపోయాడని, తాను ఎమ్మెల్సీగా అయిన తర్వాతనే నిధులు మంజూరు చేయించి బస్టాండ్ నిర్మించాలని అన్నారు. 2021 నుండి 23 వరకు తాను ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ కేంద్రం నుండి ఎన్ని నిధులు తెచ్చారో నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని అన్నారు. ఈనెల 29న అల్గునూర్ లో జరిగే దీక్ష దివస్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసి విజయవంతం చేయాలని అన్నారు. తెలంగాణ సాధన కోసం కేసిఆర్ చేసిన త్యాగాన్ని నేటి తరానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేశారని అన్నారు. గ్రామాల నుండి గులాబీ తమ్ముళ్లు భారీగా తరలిరావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు గందె శ్రీనివాస్, కేసిరెడ్డి లావణ్య, వర్ధినేని రవీందర్ రావు, సర్పంచ్ కట్కూరి మల్లారెడ్డి, పోల్సాని రామారావు, మాజీ కౌన్సిలర్లు కుమారస్వామి, మారేపల్లి సుశీల, నాయకులు ఐలయ్య, పావని గౌడ్, కొయ్యడ శ్రీదేవి, కొలిపాక సమ్మయ్య, పంజాల సదానందం గౌడ్, తొగరు శివకృష్ణ, తలకొక్కుల హరిప్రసాద్, దాసి కుమార్, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.