telangana
బంగారం కోసం వృద్ధురాలి హత్య కేసు... -- ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు
సూర్య, శంకరపట్నం:బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ. 9 వేల చొప్పున జరిమానా విధిస్తూ కరీంనగర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. షేక్ గౌస్ పాషా, వంకాడే మోహన్, మహ్మద్ నూర్జహాన్ బేగంలకు ఈ శిక్ష ఖరారైంది. కేసు వివరాలిలా ఉన్నాయి... హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపెల్లి గ్రామానికి చెందిన గుండారపు ప్రమీల తన తండ్రి ఇజ్జగిరి కొమరయ్య అనారోగ్యం తగ్గేందుకు తాయెత్తు కట్టించడానికి 2023 అక్టోబర్ 1న మొలంగూరుకు వెళ్లేందుకు బయలుదేరింది. మార్గమధ్యలో ముగ్గురు నిందితులు ఆమెకు మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకుని శంకరపట్నం మండలం తాడికల్ శివారులోని శివాలయం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను లాక్కునేందుకు ప్రయత్నించగా ప్రమీల ప్రతిఘటించింది. దీంతో నిందితుడు గౌస్ పాషా కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమె వద్ద ఉన్న 27.2 గ్రాముల బంగారు పుస్తెలతాడు, బంగారు నాణెం ఎత్తుకెళ్లి నిందితులు పరారయ్యారు. దోచుకున్న బంగారాన్ని విక్రయించేందుకు ప్రయత్నించగా పోలీసుల దర్యాప్తులో నిందితుల గుట్టు రట్టయింది. నాటి కేశవపట్నం ఎస్ఐ లక్ష్మారెడ్డి కేసు నమోదు చేయగా, అప్పటి హుజురాబాద్ రూరల్ సిఐ సంతోష్ కుమార్ లోతుగా విచారణ జరిపి నిందితులను అరెస్టు చేసి, పక్కా ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా సాక్షుల వాంగ్మూలాలు, పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ముగ్గురిని దోషులుగా తేల్చుతూ జీవిత ఖైదు విధించారు. బాధితులకు న్యాయం జరిగేలా పక్కా ఆధారాలు సేకరించి నిందితులకు శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించిన దర్యాప్తు అధికారులు ఎస్ఐ లక్ష్మారెడ్డి, సిఐ సంతోష్ కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్యాల ప్రతాప్, హుజురాబాద్ రూరల్ సిఐ శ్రీనివాస్, కేశవపట్నం ఎస్ఐ నరేష్ రెడ్డి, సిఎంఎస్ ఏఎస్ఐ సత్తయ్య, సెషన్స్ కోర్టు కానిస్టేబుల్ కరుణాకర్‌లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా సమర్థవంతమైన దర్యాప్తు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.