సర్పంచ్ అభ్యర్థులతో పోలీసుల ఎన్నికల అవగాహన సమావేశం
శాంతియుత, పారదర్శక ఎన్నికలకు ప్రతి అభ్యర్థి సహకరించాలి – సీఐ ఎం. శ్రీనివాసరావు
నరసన్నపేట నవంబర్ 27 మేజర్ న్యూస్ : గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి సర్పంచ్ అభ్యర్థి సహకరించాలని నరసన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. శ్రీనివాసరావు కోరారు.
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నరసన్నపేట, పోలాకి పోలీస్ స్టేషన్ల పరిధిలో సర్పంచ్ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులతో శుక్రవారం ఎన్నికల అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పోలీసుల ఆంక్షలు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి అధికారులు అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.
ఎన్నికల ప్రచార సమయంలో ప్రత్యర్థి అభ్యర్థుల పట్ల సంయమనం పాటించాలని, ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, డబ్బు, మద్యం పంపిణీ చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని స్పష్టం చేశారు. కుల, మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు నిర్వహించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
పోలింగ్ ప్రక్రియలో ఎన్నికల సిబ్బందికి, పోలీసులకు అభ్యర్థులు పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల లోపలికి ఓటర్లు, అభ్యర్థులు, ఏజెంట్లు, ఇతర అనధికార వ్యక్తులు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం నిషేధమని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధీకృత సిబ్బందికి మాత్రమే నిబంధనల ప్రకారం మినహాయింపు ఉంటుందని వివరించారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఫలితాల అనంతరం కూడా గ్రామాల్లో సోదరభావం, సామరస్యపూర్వక వాతావరణం కొనసాగించే బాధ్యత ప్రతి అభ్యర్థిపై ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ సమావేశంలో పోలాకి ఎన్నికల ప్రత్యేక అధికారి ఎల్.వి. మధు, నరసన్నపేట ఎంపీడీవో విశ్వప్రసాద్, పోలాకి తహసీల్దార్, ఎంపీడీవో, నరసన్నపేట ఎస్సై బి. గణేష్, పోలాకి ఎస్సై రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
నరసన్నపేట, పోలాకి మండలాల్లో ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అభ్యర్థులందరూ అధికారులకు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు విజ్ఞప్తి చేశారు.