ఓటు లెక్కింపులో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంనగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని అదనపు ఎన్నికల అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా సూచించారు.
శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్‌లో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, విధివిధానాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు, బ్యాలెట్ పత్రాల విభజన, లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిబ్బంది విధులపై సమగ్రంగా చర్చించారు.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, అందుకు ముందుగానే అవసరమైన ఏర్పాట్లు, సన్నాహాలు పూర్తి చేయాలని తెలిపారు. ఉదయం 5 గంటలకే కౌంటింగ్ టేబుళ్లకు సంబంధిత అధికారులను కేటాయిస్తామని, కౌంటింగ్ కేంద్రాల్లో బారికేడింగ్, సీటింగ్ ఏర్పాట్లు నిబంధనల ప్రకారం చేపట్టాలని ఆదేశించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తిచేసిన అనంతరం బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. బ్యాలెట్ పత్రాలను తొలుత మేయర్ అభ్యర్థులకు సంబంధించినవి, వార్డు అభ్యర్థులకు సంబంధించినవిగా వేర్వేరుగా విభజించి, అనంతరం లెక్కింపు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపు వివరాలను కంప్యూటరీకరించడం ద్వారా ఫలితాల నమోదు, క్రోడీకరణ వేగవంతంగా, పారదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రతి రౌండ్‌లో 1,000 బ్యాలెట్ పత్రాల లెక్కింపు విధానంపై సిబ్బందికి శిక్షణలో పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కోసం స్థానిక ఎస్‌కేవీటీ కళాశాలలో రెండు అంతస్తుల్లో 24 గదుల్లో మొత్తం 180 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ అధికంగా జరిగిన వార్డుల్లో ఫలితాలను త్వరితగతిన వెల్లడించేందుకు అవసరమైన అదనపు కౌంటింగ్ టేబుళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి దశను నిబంధనల ప్రకారం నిర్వహిస్తూ, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కనకరాజు, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, రెవెన్యూ అధికారి సీహెచ్ శ్రీనివాసరావు, మేనేజర్ అబ్దుల్ మలిక్ తదితర అధికారులు పాల్గొన్నారు.