విజయవాడ మెట్రోకు పటిష్ట హెచ్‌ఆర్ ప్రణాళిక
విజయవాడ కార్పొరేషన్, మేజర్ న్యూస్: విజయవాడ మెట్రో రైల్ నిర్వహణకు పటిష్టమైన మానవ వనరుల ప్రణాళిక రూపొందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాజెక్టుకు సంబంధించి మానవ వనరుల విధానం, ఉద్యోగుల నియామక నిబంధనల రూపకల్పనపై ఏర్పాటు చేసిన ఉపసంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తున్న మెట్రో రైళ్లలో అనుసరిస్తున్న సిబ్బంది నియామక విధానం, వివిధ విభాగాలకు అవసరమైన ఉద్యోగుల సంఖ్య, జీతభత్యాలు, విధులు, సేవా నిబంధనలను అధ్యయనం చేసి విజయవాడ మెట్రోకు అనువైన విధానాన్ని రూపొందించాలని సూచించారు. మెట్రో సేవలు ప్రారంభమయ్యే సమయానికి సిబ్బంది నియామకం, విధుల కేటాయింపు, పరిపాలన, నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య పెరిగినా, మెట్రో మార్గాల విస్తరణ జరిగినా సమర్థవంతంగా సేవలు అందించేలా దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మానవ వనరుల విధానం, ఉద్యోగుల నిర్వహణ మార్గదర్శకాలను రూపొందించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఎంఆర్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.పి. రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రతినిధి జె. శివయ్య, ఏపీఎంఆర్‌సీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) సహదేవ్ సింగ్, వీఎంసీ చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారి, సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ప్రతినిధి నితిన్ కోఠారి తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.