కేజీబీవీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
కేజీబీవీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
-పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రుల ఆరోపణలు
-ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ ఎదుట ధర్నా.. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మద్దతు
సిద్దిపేట రూరల్ : రూరల్ మండలం రాఘవపూర్ కేజీబీవీలో పదో తరగతి విద్యార్థిని లాస్య (15) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ ఎదుట ధర్నా నిర్వహించారు. వారికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మద్దతు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన దాపులగల్ల సంతోష్ కుమార్ కుమార్తె లాస్య రాఘవపూర్ కేజీబీవీలో పదో తరగతి చదువుతోంది. దసరా సెలవుల అనంతరం ఈ నెల 24న పాఠశాలకు తిరిగి వెళ్లింది. ఈ నెల 28న ఉదయం 9 గంటలకు లాస్య ఆరోగ్యం బాగోలేదని పాఠశాల ఉపాధ్యాయులు ఆమె తండ్రికి ఫోన్ చేశారు. అదే రోజు రాత్రి 9.30 గంటల సమయంలో ఆమెకు రెండు మూడు రోజుల క్రితమే రుతుస్రావం ప్రారంభమైందని, ఉదయం వచ్చి ఇంటికి తీసుకెళ్లాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు.గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో లాస్య తండ్రి పాఠశాలకు ఫోన్ చేసి పరిస్థితిని ఆరా తీయగా, ఆమె ఆరోగ్యం విషమించడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నామని సిబ్బంది తెలిపినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రికి చేరుకునే సమయానికి లాస్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తండ్రి సంతోష్ కుమార్ ఫిర్యాదు చేసినట్లు సీఐ విద్యాసాగర్ తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి
విద్యార్థిని లాస్య మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. లాస్య మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే ఆసుపత్రికి వచ్చి బాధిత కుటుంబానికి సమాధానం చెప్పాలని కోరారు. మృతురాలి కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
(సూర్య రూరల్, రమేష్)