telangana
నివాస ప్రాంతంలో 100 కిలోల టపాసుల అక్రమ నిల్వ.. ఇద్దరి అరెస్ట్
మేడిపల్లి, మేజర్ న్యూస్: నివాస ప్రాంతంలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా భారీ మొత్తంలో టపాసులను అక్రమంగా నిల్వ ఉంచిన ఇద్దరు వ్యక్తులను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 58 పెట్టెలు, ఇతర ప్యాకెట్లలో ఉన్న సుమారు 100 కిలోల టపాసులను స్వాధీనం చేసుకున్నారు.మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచవాని సింగారం, జయశంకర్ విగ్రహం సమీపంలోని నివాస ప్రాంతంలో టపాసులను భద్రతా చర్యలు లేకుండా నిల్వ ఉంచినట్లు గురువారం ఉదయం సుమారు 8 గంటలకు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడ తనిఖీలు నిర్వహించి, వివిధ రకాల టపాసులను నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు.ఈ ఘటనకు సంబంధించి కాచవాని సింగారానికి చెందిన ఏలగందుల స్వామి (31), తండ్రి వెంకటేష్, వృత్తి బార్బర్, ఉప్పల్‌లోని దేవేందర్ నగర్ కాలనీకి చెందిన జక్కుల శ్రీనివాస్ (36), తండ్రి మల్లేష్, వృత్తి డ్రైవర్‌లను గుర్తించారు. విచారణలో తగిన భద్రతా చర్యలు పాటించకుండా టపాసులను నిల్వ ఉంచినట్లు వెల్లడైంది. దీంతో టపాసులను స్వాధీనం చేసుకుని, ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి: సీఐ జలేందర్ రెడ్డి
నివాస ప్రాంతాల్లో అనుమతులు లేకుండా టపాసులను నిల్వ ఉంచడం ప్రమాదకరమని మేడిపల్లి సీఐ జలేందర్ రెడ్డి హెచ్చరించారు. అగ్నిప్రమాదాలు, ప్రాణనష్టం, ఆస్తి నష్టాలను నివారించేందుకు బాణసంచా నిల్వ విషయంలో సంబంధిత నిబంధనలు, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అక్రమంగా టపాసులను నిల్వ ఉంచడం లేదా ప్రమాదకర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.