telangana
దౌలాపూర్ శివారులో వ్యక్తి మృతి.. ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన మరుసటి రోజే విషాదం
యాలాల, మేజర్ న్యూస్ : తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన వ్యక్తి దౌలాపూర్ గ్రామ శివారులో మృతదేహంగా కనిపించిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.వివరాల్లోకి వెళ్తే.. సూర్య గౌడ్ జ్యోతి భర్త రాము గౌడ్ (47) గత కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆయన మానసిక స్థితి కూడా సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు అక్టోబర్ 26న చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆసుపత్రి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో తన భర్త కనిపించడం లేదని భార్య అక్టోబర్ 28న తాండూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.ఈ నేపథ్యంలో అక్టోబర్ 29న దౌలాపూర్ గ్రామ శివారులో రాము గౌడ్ మృతదేహం లభ్యమైనట్లు సమాచారం అందింది. రాత్రి సమయంలో మూర్ఛ వ్యాధి రావడం, అనారోగ్య కారణాల వల్లే తన భర్త మృతి చెందినట్లు భార్య ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.