ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం
తాగునీరు, రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం నకరికల్లు జోరుగా టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిని ఎన్నికల ప్రచారం
నకరికల్లు: ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిని డాక్టర్ నాగోతు వెంకటలక్ష్మి సరోజ అన్నారు. నకరికల్లు మండలంలోని చాగల్లు, కండ్లకుంట, చీమలమర్రి, చల్లగుండ్ల గ్రామాల్లో ఆమె నిన్న విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తనను ఆదరించి జెడ్పీటీసీగా గెలిపిస్తే మండలంలోని తాగునీటి సమస్య పరిష్కారానికి, గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.పదవుల కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు. నకరికల్లు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తనకు అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు.ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.