ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నాము : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
రేపల్లె, మేజర్‌న్యూస్ :
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో, స్వేచ్ఛగా నిర్వహించేందుకు బాపట్ల జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. గురువారం రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్లో రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఎన్నికల భద్రతా ఏర్పాట్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, పోలీస్ బలగాల సమన్వయం తదితర అంశాలపై సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఎన్నికల ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించేందుకు రూపొందించబడిన సమర్థ్ మొబైల్ యాప్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రేపల్లె పట్టణంలోని ఏబీఎమ్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలను ఎస్పీ గారు స్వయంగా పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం రేపల్లె పట్టణంలోని ప్రకాశం మున్సిపల్ స్కూల్లో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, ఆయా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రేపల్లె మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ఉన్న 44 పోలింగ్ బూత్‌లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, భద్రతా పరంగా వాటిని మూడు జోన్లుగా విభజించి 7 రూట్ మొబైల్స్, 2 స్ట్రైకింగ్ ఫోర్స్‌లు, 2 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గారు తెలిపారు. అదేవిధంగా రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని 9 జడ్పీటీసీ, 133 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికల కోసం 23 జోన్లను ఏర్పాటు చేసి, 49 రూట్ మొబైల్స్, 9 స్ట్రైకింగ్ ఫోర్స్‌లు, 4 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
జిల్లాలో నవంబర్ 1వ తేదీన జరగనున్న రేపల్లె మున్సిపల్ ఎన్నికలు, నవంబర్ 5వ తేదీన జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, తదుపరి నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ గారు పేర్కొన్నారు. ఎన్నికల రోజున రూట్ మొబైల్స్, పెట్రోలింగ్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్‌లు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లు, పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది మధ్య సమన్వయం ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
ఎన్నికల విధుల్లో పోలీస్ బలగాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో సమర్థ్ మొబైల్ యాప్‌ను రూపొందించినట్లు ఎస్పీ గారు తెలిపారు. ఎన్నికల రోజున విధుల్లో ఉండే పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలను యాప్‌లో పొందుపరిచి, గూగుల్ మ్యాప్స్ సాంకేతికతను అనుసంధానం చేసినట్లు వివరించారు. ఏదైనా ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి తలెత్తినప్పుడు, ఆ సమాచారాన్ని వెంటనే సంబంధిత అధికారులకు, కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరవేసి, సమీపంలో ఉన్న పోలీస్ బృందాలను వేగంగా సంఘటనా స్థలానికి పంపేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సమస్య తలెత్తిన ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీస్ బలగాలు వెంటనే స్పందించి పరిస్థితులను అదుపులోకి తీసుకోవడం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు చేపట్టడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. తొలుత చీరాల, రేపల్లె మున్సిపల్ ఎన్నికల్లో సమర్థ్ యాప్‌ను వినియోగించనున్నట్లు వెల్లడించారు.
గత ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలు, ప్రస్తుత స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక గ్రామాలు, వార్డులను గుర్తించినట్లు ఎస్పీ గారు తెలిపారు. ఆయా ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, పోలీస్ అధికారులు, సిబ్బంది తరచూ సందర్శిస్తూ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నామన్నారు. సమస్యలకు కారణమయ్యే వ్యక్తులు, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై చట్టప్రకారం బైండోవర్ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై నిఘా ఉంచడం జరిగిందన్నారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఎస్పీ గారు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని, ఎక్కడైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తితే వెంటనే స్థానిక పోలీసులకు, లేదా ఎలక్షన్ సెల్ కంట్రోల్ రూమ్ 8333813228 లేదా 112 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు.
ఈ సమావేశంలో బాపట్ల అడిషనల్ ఎస్పీ ఎల్. సుధాకర్, రేపల్లె డీఎస్పీ అబ్దుల్ అజీజ్, రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.