కలెక్టర్ సార్...మా బడి సమస్యను తీర్చండి... ఒకే గదిలో 5 తరగతులు.. కే.వీరభద్రపురం బడిలో 40 మంది విద్యార్థుల ఇబ్బందులు.
కలెక్టర్ సార్...మా బడి సమస్యను తీర్చండి.
* ఒకే గదిలో 5 తరగతులు.. కే.వీరభద్రపురం బడిలో 40 మంది విద్యార్థుల ఇబ్బందులు.
* అర్ధాంతరంగా నిలిచిన మన ఊరు మనబడి నిర్మాణాలు.
* ఎమ్మెల్యే హామీ ఇచ్చినా మారని పరిస్థితి.
దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్)::
కలెక్టర్ సార్..మా పిల్లల భవిష్యత్తును కాపాడండి ఒక్క గదిలోనే 5 తరగతులు కూర్చుంటే మా పిల్లలు ఏం చదువుకోవాలి అంటూ దుమ్ముగూడెం మండలం,ప్రగళ్లపల్లి పంచాయతీ పరిధిలోని కే.వీరభద్రపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు విద్యారంగానికి వేల కోట్లు కేటాయిస్తున్నామని గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నిరుపేద పిల్లల చదువుల దుస్థితి ఎక్కడా మారడం లేదు.అధికారుల నిర్లక్ష్యం ప్రజాప్రతినిధుల ఉదాసీనత వల్ల అభం శుభం తెలియని చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ దుస్థితిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తమ బడి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకున్నారు.
*ఒకే గదిలో ఐదు తరగతులు.. గందరగోళంలో బోధన:*
గ్రామంలో పాఠశాల ఉన్నప్పటికీ ఒక్క చిన్న గదిలోనే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న మొత్తం 40 మంది విద్యార్థులను కూర్చోబెట్టి ఉపాధ్యాయులు బోధించాల్సి వస్తోంది.పిల్లలకు చదువు సరిగ్గా ఎందుకు రావడం లేదని తల్లిదండ్రులు ప్రశ్నించగా ఒకే సమయంలో ఒకే గదిలో 5 వేర్వేరు తరగతుల పిల్లలకు పాఠాలు చెప్పడం చాలా శ్రమతో కూడుకున్న పని ఎవరిపై శ్రద్ధ వహించాలన్నా గందరగోళంగా మారుతోంది. సదుపాయాలు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం అని ఉపాధ్యాయులు తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు.ప్రైవేట్ బడికి పంపే ఆర్థిక స్థోమత లేక ఉన్న బడిలో చదువు రాక వేరే దారి లేక తమ పిల్లలను ఇతర పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.ఈ క్రమంలోనే గడిచిన మూడేళ్ల వ్యవధిలోనే ఏకంగా 20 మంది విద్యార్థులు ఈ స్కూల్ నుంచి టీసీలు తీసుకుని వేరే పాఠశాలలకు వెళ్లిపోయారు.ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ పాఠశాల మూతపడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
*ర్ధాంతరంగా నిలిచిన 'మన ఊరు - మన బడి' పనులు:*
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 'మన ఊరు - మన బడి' పథకం కింద ఈ పాఠశాలకు నూతన భవనం మంజూరైంది.పనులు కూడా కొంతమేర ప్రారంభమయ్యాయి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.దీనిపై లక్ష్మీనగరం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ గ్రామస్తులు సంప్రదించగా.. మేము ఇప్పటివరకు చేసిన పనులకు సంబంధించిన బిల్లులను ఆన్‌లైన్ చేసి ప్రభుత్వానికి పంపాము. కానీ ప్రభుత్వం నుంచి ఆ బిల్లులు రావడం లేదు. మాకు రావాల్సిన బిల్లులు పడితేనే నిలిచిపోయిన స్కూల్ పనులను తిరిగి ప్రారంభిస్తాం అని ఆయన తేల్చిచెప్పారు.
*ఎమ్మెల్యే హామీ ఇచ్చినా మారని పరిస్థితి: వార్డు సభ్యుడు రామకృష్ణ ఆవేదన.*
పాఠశాల సమస్యపై కే.వీరభద్రపురం వార్డు సభ్యుడు రామకృష్ణ మాట్లాడుతూ..ఒక్క గది ఉండటం వల్ల 40 మంది విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బందులు విషయమై అధికారులు,స్థానిక ఎమ్మెల్యే దృష్టికి పలుమార్లు సమస్యను తీసుకెళ్లాం స్వయంగాఎమ్మెల్యే పాఠశాలను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు.త్వరలోనే నూతన భవనాన్ని నిర్మించి ఇబ్బందులను తొలగిస్తామని గ్రామస్తుల సమక్షంలో హామీ ఇచ్చారు. కానీ నెలలు గడుస్తున్నా ఆ హామీ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిలిచిపోయిన పాఠశాల భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయించి కే.వీరభద్రపురం గ్రామానికి చెందిన పేద చిన్నారులకు నాణ్యమైన విద్య అందేలా వారి భవిష్యత్తును కాపాడాలని వార్డు సభ్యుడు రామకృష్ణతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.
దుమ్ముగూడెం సూర్య రిపోర్టర్ .. సుమన్.8374172684