రైస్ మిల్లుల వద్ద రోజుల తరబడి పడిగాపులు.. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం ఒత్తిడి చేస్తేనే ధర పెంపునకు అంగీకారం.. అకాల గాలివానలతో ఇప్పటికే నష్టాల్లో అన్నదాతలు మిల్లర్ల తీరుపై రైతుల ఆగ్రహం.. అధికారుల పర్యవేక్షణ ఏదీ?
మిల్లర్ల సిండికేట్‌తో రైతులకు కష్టాలు!
రైస్ మిల్లుల వద్ద రోజుల తరబడి పడిగాపులు.. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం
ఒత్తిడి చేస్తేనే ధర పెంపునకు అంగీకారం.. అకాల గాలివానలతో ఇప్పటికే నష్టాల్లో అన్నదాతలు
మిల్లర్ల తీరుపై రైతుల ఆగ్రహం.. అధికారుల పర్యవేక్షణ ఏదీ?
మిర్యాలగూడ అర్బన్,మేజర్ న్యూస్: మిర్యాలగూడ ప్రాంతంలో రైస్ మిల్లుల వద్ద రైతులకు ధాన్యం విక్రయాల కష్టాలు తప్పడం లేదు. ధాన్యం తీసుకొచ్చిన రైతులు రోజుల తరబడి మిల్లుల వద్ద ఎండకు, వానకు తడుస్తూ పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తూ, ధరలను తగ్గిస్తూ మిల్లు యాజమాన్యాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైస్ మిల్లర్లంతా సిండికేట్‌గా ఏర్పడి ఉద్దేశపూర్వకంగా ధరలు తగ్గిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల సమస్యలపై సంబంధిత అధికారులు సరైన పర్యవేక్షణ చేయడం లేదని విమర్శిస్తున్నారు.
ధర్నా చేస్తేనే ధర పెంపునకు అంగీకారం!
తాజాగా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్‌లోని సాంబశివ రైస్ మిల్ వద్ద రైతులు భారీ ధర్నా నిర్వహించడం మిల్లుల వద్ద నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. ధాన్యం ధరను ఒక్కసారిగా తగ్గించడంతో పాటు, రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటూ స్థానిక రైతుల ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
రైతుల ఆందోళనతో కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి మిల్లు యాజమాన్యంతో చర్చలు జరిపారు. చివరకు క్వింటాల్ ధాన్యానికి రూ.3,800 చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించడంతో రైతులు ధర్నా విరమించారు.
అకాల వర్షాలు.. ఆపై మిల్లర్ల ఇబ్బందులు!
ఇప్పటికే అకాల గాలివానల కారణంగా పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు మిల్లుల వద్దకు తీసుకొస్తే అక్కడ కూడా రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. రవాణా ఖర్చులు, ధాన్యం ఆరబెట్టే ఇబ్బందులు, వాతావరణ ప్రతికూలతలతో సతమతమవుతున్న తమకు మిల్లర్ల వ్యవహారం మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మిల్లులో ఇదే పరిస్థితా?
ఒక మిల్లు వద్ద రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తేనే ధర పెంచేందుకు అంగీకరిస్తారా? మిగతా మిల్లుల వద్దకు ధాన్యం తీసుకెళ్లిన రైతుల పరిస్థితి ఏమిటని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. మిల్లర్ల మధ్య సమన్వయంతో ధరలు తగ్గిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రైస్ మిల్లుల వద్ద ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.