telangana
కార్తీక మాసంలో పోచంపాడ్ ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు
సూర్య బాల్కొండ కార్తీక మాసం సందర్భంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలోని రామాలయం, శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సుమారు 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాలు పరిసర గ్రామాల ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి.కార్తీక మాసాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామునే భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాస విశిష్టతను చాటుతూ ప్రతిరోజూ ఒక్కో దీపం చొప్పున 31 దీపాలు, ఉసిరికాయ దీపాలు వెలిగిస్తూ భక్తిశ్రద్ధలతో దీపారాధనలు చేస్తున్నారు. శివకేశవులను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి పర్వదినాలకు విశేష ప్రాధాన్యత ఉండటంతో ఆయా రోజుల్లో ఆలయాలకు భక్తుల తాకిడి మరింత పెరుగుతోంది. ఈ నెల 24వ తేదీ గురువారం పౌర్ణమిని పురస్కరించుకొని రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక ఆకాశ దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సంతోష్, చందు, సతీష్, పంతులు తదితరులు పాల్గొన్నారు.