కార్తీక దీపం అంటుకుని యువతి మృతి
హైదరాబాద్, నవంబరు 28: కార్తీక దీపం మంటలు చీరకు అంటుకుని తీవ్రంగా గాయపడిన ఓ యువతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో నివాసముంటున్న సాయి వెంకట సింధు (18) రోడ్ నంబర్ 5లో 'ఎస్‌ఎస్ బొటీక్' నిర్వహిస్తోంది. ఈ నెల 12న రాత్రి షాపులో పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, ఇంటి గేటు వద్ద వెలిగించి ఉంచిన కార్తీక దీపం ప్రమాదవశాత్తు ఆమె చీరకు అంటుకుంది. క్షణాల్లోనే మంటలు ఒళ్లంతా వ్యాపించడంతో సింధు తీవ్రంగా గాయపడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఆమె మృతి చెందింది. చేతికొచ్చిన కూతురు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.