తిరుప్పరంగున్రం దీపం వివాదం వేళ మురుగన్ భక్తి నినాదం పంచుకున్న ప్రధాని మోదీ
సూర్య జాతీయ డెస్క్: తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరంగున్రం కొండపై ఉన్న దీపతూన్ స్తంభం వద్ద శనివారం కార్తిక దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన కొద్ది గంటలకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మురుగన్ స్వామిని స్మరిస్తూ భక్తి సందేశాన్ని పంచుకున్నారు. శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా తమిళ సంప్రదాయ భక్తి నినాదమైన వెట్రివేల్ మురుగనుక్కు అరోగరా అనే మంత్రాన్ని ఇంగ్లీష్, తమిళం, హిందీ లిపులలో పోస్ట్ చేశారు. అయితే ఆ పోస్ట్‌లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల గురించి గానీ, దీపం వెలిగించే అంశంపై కొనసాగుతున్న వివాదం గురించి గానీ నేరుగా ప్రస్తావించలేదు.
నవంబర్ 20న ఇచ్చిన మునుపటి ఆదేశాన్ని అమలు చేయడంలో విఫలమైన నేపథ్యంలో, నవంబర్ 28న దీపతూన్ వద్ద సంప్రదాయ దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఉన్నతాధికారులపై కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించడంతో పాటు మరో 13 మందికి నోటీసులు జారీ చేసింది. అరుళ్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయ ధర్మకర్తల మండలిని సస్పెండ్ చేసిన ధర్మాసనం, ఆలయ పరిపాలనను పర్యవేక్షించేందుకు, ఆదేశాల అమలును నిర్ధారించేందుకు మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులిద్దరిని రిసీవర్లుగా నియమించింది. ఆలయానికి, సమీపంలోని దర్గాకు సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పించాలని ఆదేశించడంతో పాటు దీపం వెలిగించే ఏర్పాట్లు దర్గాకు కనీసం 50 మీటర్ల దూరంలో ఉండాలని షరతు విధించింది.
మరోవైపు ఈ వివాదంపై తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు కేపీ రామలింగం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, సుప్రీంకోర్టు జోక్యాన్ని స్వాగతించారు. నామక్కల్ జిల్లా రాసిపురంలో పార్టీ నిర్వహించిన ఆరమ్ కాకుమ్ ఆలయ దీపం కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఆంజనేయ స్వామి ఆలయం నుంచి అరుళ్మిగు నిత్య సుమంగళి మరియమ్మన్ ఆలయం వరకు దీపాలతో నిర్వహించిన ఊరేగింపులో కార్యకర్తలతో కలిసి నడిచారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దీపం వెలిగించారు.
నవంబర్ 28న జరగాల్సిన దీపం కార్యక్రమానికి ముందు సుప్రీంకోర్టు ఆదేశాల అమలును డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామని, ఈ ప్రచారంలో భాగంగా 2,116 ఆలయాలలో దీపాలు వెలిగించామని రామలింగం విలేకరులతో చెప్పారు. కోర్టు మునుపటి ఆదేశాన్ని గౌరవించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంలో మదురై జిల్లా కలెక్టర్ వైఖరిని, అలాగే శాంతిభద్రతల నిర్వహణ విషయంలో ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రిని కోరుతూనే, తమ పార్టీ ప్రచారాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.