వారణాసిలో నేడు కాశీ తమిళ సంగమం 5.0 ప్రారంభోత్సవం
సూర్య జాతీయ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి వేదికగా కాశీ తమిళ సంగమం ఐదవ ఎడిషన్ శనివారం ఘనంగా ప్రారంభం కానుంది. భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నమో ఘాట్ వద్ద ఈ ప్రతిష్టాత్మక సాంస్కృతిక మరియు విద్యా మార్పిడి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు 15 రోజుల పాటు సాగే ఈ వేడుకల ముగింపు సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వారణాసిలోని శ్రీ కాలభైరవ ఆలయం, శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కాశీ మరియు తమిళనాడు మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, భాషా, నాగరికత బంధాలను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది కార్యక్రమాన్ని తిరుక్కురల్ పయిల్వోమ్ తిరుక్కురల్ అభ్యాస్ కరేన్ అంటే తిరుక్కురల్ నేర్చుకుందాం అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. తమిళ సాహిత్యంలో అత్యంత విశిష్టమైన తిరుక్కురల్ లోని నైతిక విలువలు, జీవన బోధనలను దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతకు పరిచయం చేయడంపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
తమిళనాడు నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, రచయితలు, మీడియా ప్రతినిధులు, రైతులు, కళాకారులు, మహిళలు, ఆధ్యాత్మిక వేత్తలతో కూడిన 1,400 మందికి పైగా ప్రతినిధులు ఈ సంగమంలో పాల్గొననున్నారు. ఏడు బృందాలుగా రానున్న వీరు వారణాసితో పాటు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం, అయోధ్యలోని శ్రీరామ మందిరాన్ని సందర్శిస్తారు. వారణాసి పర్యటనలో కాశీ విశ్వనాథ ఆలయం, రాంనగర్ కోట, భారత్ మాతా మందిరంతో పాటు మహాకవి సుబ్రమణ్య భారతి పూర్వీకుల నివాసం, కేదార్ ఘాట్, లిటిల్ తమిళనాడుగా పిలిచే కాశీ మఠం వంటి తమిళ వారసత్వ ప్రదేశాలను సందర్శించి గంగా హారతి, విద్యా చర్చా గోష్ఠులలో పాలుపంచుకుంటారు.
దేశవ్యాప్తంగా వెయ్యి ఉన్నత విద్యా సంస్థలలో తిరుక్కురల్ అధ్యయన కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు ఉత్తరప్రదేశ్ పాఠశాలల్లో బోధించేందుకు తమిళనాడు నుంచి 50 మంది ఉపాధ్యాయులు వారణాసికి చేరుకున్నారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో తిరుక్కురల్ జాతీయ సదస్సు, నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పఠన కార్యక్రమాలు, ప్రాంతీయ చేనేత హస్తకళల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ రూపొందించిన బహుభాషా యాప్, యానిమేషన్ వీడియోలు, ఆడియోబుక్స్ ద్వారా తిరుక్కురల్ బోధనలను 22 షెడ్యూల్డ్ భాషలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.