మాటలు చెప్పడానికి కాదు.. అభివృద్ధి చేసి చూపించడానికి వచ్చా: ప్రవీణ్ రెడ్డి! కోడిగేనహళ్లిని నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే నాలక్ష్యం.. పదవి కోసం కాదు.. పుట్టి పెరిగిన గడ్డకు సేవ చేయడానికే పోటీ.. శనివారం సుబ్బరాయునిపల్లి కాలువపల్లిలో విస్తృత ప్రచారం
నేను మాటలు చెప్పడానికి రాలేదు.. చేసి చూపించడానికి వచ్చాను. కోడిగేనహళ్లిని ఆదర్శ పంచాయతీగా.. అభివృద్ధిలో నంబర్ వన్‌గా మార్చడమే నా లక్ష్యం అని కోడిగేనహళ్లి మేజర్ గ్రామపంచాయతీ కూటమి తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి నేటి దినపత్రిక 'సూర్య'తో స్పష్టం చేశారు. ఈ ఎన్నిక తనకు పదవి కోసం కాదని, తనను పెంచిన కోడిగేనహళ్లి గడ్డకు సేవ చేయడానికేనని ఆయన అన్నారు.కోడిగేనహళ్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రజల కళ్లలో ఒకటే ఆశ కనిపిస్తోందని, గ్రామాల్లో మార్పు రావాలనే ఆకాంక్ష బలంగా ఉందని తెలిపారు. ఆ మార్పు కోసమే తాను ఎన్నికల బరిలోకి దిగానని ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు. కులం, వర్గం అనే తేడాలు చూడకుండా అందరినీ కలుపుకుని ముందుకు సాగుతానని, ఆలయమైనా.. మసీదైనా.. చర్చి అయిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.అన్నా.. నాకు కష్టం వచ్చింది అంటే.. నేనున్నా అంటూ ముందుగా నిలబడతా. ప్రజల కష్టాల్లో భాగస్వామిని కావడమే నా రాజకీయం" అని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా శనివారం సుబ్బరాయునిపల్లి కాలువపల్లిలో ప్రవీణ్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలుసుకుని తన ఆలోచనలు వివరించారు. ప్రచారంలో స్థానికుల నుంచి స్పందన లభించింది.