జనవరి ఆరంభంలో షిప్పింగ్ ఆసక్తి పరిశీలనకు కసరత్తు
సూర్య బిజినెస్ డెస్క్: కెనడాలోని ట్రాన్స్ మౌంటైన్ చమురు పైప్‌లైన్ సామర్థ్యాన్ని రోజుకు దాదాపు 2,10,000 బ్యారెళ్ల మేర పెంచే విస్తరణ ప్రాజెక్టుపై వాణిజ్యపరమైన ఆసక్తిని అంచనా వేసేందుకు జనవరి ప్రారంభంలో ప్రత్యేక ప్రక్రియను చేపట్టనున్నట్లు సంస్థ సీఈఓ మార్క్ మాకీ వెల్లడించారు. షిప్పర్ల నుంచి తగినంత ఆసక్తి, డిమాండ్ ఉందా లేదా నిర్ధారించుకునేందుకు ఓపెన్ సీజన్ ప్రక్రియను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మెయిన్‌లైన్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్టు కింద బ్రిటిష్ కొలంబియాలో సుమారు 30 కిలోమీటర్ల మేర కొత్త పైప్‌లైన్ నిర్మించడంతో పాటు ఇప్పటికే ఉన్న పైప్‌లైన్ మార్గంలో 11 కొత్త పంప్ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఈ విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించి తుది పెట్టుబడి నిర్ణయాన్ని 2027 ఏప్రిల్ నాటికి తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మార్క్ మాకీ పేర్కొన్నారు. అన్ని అనుమతులు, ప్రక్రియలు సజావుగా సాగితే 2028 చివరి నాటికి నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. కెనడా ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ ట్రాన్స్ మౌంటైన్ పైప్‌లైన్ అల్బెర్టా ప్రాంతం నుంచి బ్రిటిష్ కొలంబియా పశ్చిమ తీరానికి ముడి చమురును రవాణా చేస్తుంది. అక్కడి నుంచి చైనా సహా ఆసియాలోని వివిధ అంతర్జాతీయ మార్కెట్లకు చమురు నౌకల ద్వారా ఎగుమతులు జరుగుతున్నాయి.
ఇప్పటికే పైప్‌లైన్ ద్వారా చమురు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టిన ప్రాజెక్టు షెడ్యూల్ కంటే రెండు నెలలు ముందుగానే పూర్తయింది. రసాయన సంకలనాలను ఉపయోగించి చేపట్టిన ఈ చర్య వల్ల పైప్‌లైన్ రవాణా సామర్థ్యం సుమారు 10 శాతం వరకు పెరిగి, రోజుకు 9,80,000 బ్యారెళ్లకు చేరుకుంది. అక్టోబర్‌లోనే అదనపు చమురు రవాణాను ప్రారంభించామని, నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో పైప్‌లైన్ దాదాపు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తోందని మార్క్ మాకీ తెలిపారు. వేసవిలో అదనపు రవాణా కోసం ఆఫర్ చేసిన సామర్థ్యానికి 5.5 రెట్లు అధికంగా డిమాండ్ రావడం చమురు ఎగుమతులకు ఉన్న విపరీతమైన ఆదరణను స్పష్టం చేస్తోంది.
2028 చివరి నాటికి 2,10,000 బ్యారెళ్ల అదనపు విస్తరణ కూడా పూర్తయితే పైప్‌లైన్ మొత్తం సామర్థ్యం రోజుకు 1.19 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంటుంది. మూడో త్రైమాసికంలో సగటున రోజుకు 8,40,000 బ్యారెళ్ల చమురును రవాణా చేయగా, అందులో సుమారు 60 శాతం వెస్ట్‌రిడ్జ్ మెరైన్ టెర్మినల్ ద్వారా ఆసియా దేశాలకు తరలివెళ్లింది. అమెరికాపై ఆర్థిక ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ విదేశీ మార్కెట్లలో తన చమురు ఎగుమతులను విస్తరించుకునే దిశగా కెనడాకు ఈ పైప్‌లైన్ వ్యవస్థ కీలక ఆధారంగా నిలుస్తోంది.