బిస్లేరి నీటి నమూనాలో బ్యాక్టీరియా.. సంస్థపై ఎఫ్ఎస్ఎస్ఏఐ మరోసారి చర్యలు
సూర్య బిజినెస్ డెస్క్: ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ రంగంలో ప్రముఖ బ్రాండ్‌గా ఉన్న బిస్లేరి నీటి నమూనాలో కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో సంస్థపై చర్యలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురి జిల్లా తేలిపారా గ్రామంలోని బిస్లేరి ప్లాంట్ నుంచి సేకరించిన నమూనాలో ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు నియంత్రణ సంస్థ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో బిస్లేరి ఉత్పత్తి నాణ్యత ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన రెండో ఘటన ఇది కావడం గమనార్హం.
జూలై 20, 2026న తయారై జనవరి 19, 2027 వరకు గడువు ఉన్న పీబీ 201 బ్యాచ్‌కు చెందిన నమూనాను పరీక్షించగా, ప్రాథమిక మరియు రెఫరల్ ల్యాబొరేటరీలలో కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. మురుగునీటి లీకేజీలు లేదా శుభ్రత లోపించిన పైపులైన్ల ద్వారా తాగునీటిలోకి ఈ తరహా బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంటుంది. నమూనా సురక్షితం కాదని నిర్ధారించిన అనంతరం ఆగస్టు 12న సంబంధిత బ్యాచ్ విక్రయాలను నిలిపివేయాలని సంస్థకు నియంత్రణ సంస్థ నోటీసు జారీ చేసింది. తాజాగా ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘన కింద కంపెనీపై ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఆమోదం తెలిపింది.
ఇదే వారం గోవాలోని బిస్లేరి ప్లాంట్ నుంచి సేకరించిన మరో నమూనా కూడా నాణ్యతా పరీక్షలలో విఫలమైన నేపథ్యంలో ఇదే తరహా చట్టపరమైన చర్యలను అధికారులు ప్రకటించారు. ఆ నమూనాలో బ్రోమేట్ మరియు పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ పరిమితికి మించి ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. అయితే తమ ఉత్పత్తులు వినియోగానికి సురక్షితమేనని, నియంత్రణ సంస్థకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని బిస్లేరి ఇంటర్నేషనల్ ఇప్పటికే స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ల నాణ్యతపై నిఘా ముమ్మరం చేసినట్లు నియంత్రణ సంస్థ సీఈఓ రజిత్ పున్హానీ తెలిపారు. ప్రజలలో అనవసర భయాందోళనలు కలిగించడం కాకుండా, నిబంధనల కట్టుదిట్టమైన అమలు, నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ బ్రాండ్ల నుంచి నీటి నమూనాలను సేకరించి పరీక్షించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.