వాణిజ్య రహస్యాల చోరీ, సరఫరాదారులపై ఒత్తిడి ఆరోపణలు
సూర్య బిజినెస్ డెస్క్: కృత్రిమ మేధ రంగంలో పోటీ తీవ్రమవుతున్న వేళ యాపిల్ సంస్థపై ఓపెన్ఏఐ ప్రతిదావా దాఖలు చేసింది. తమ వాణిజ్య రహస్యాలను చోరీ చేయడంతో పాటు, హార్డ్‌వేర్ సరఫరాదారుల సేవలను పొందకుండా యాపిల్ అడ్డంకులు సృష్టిస్తోందని కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఓపెన్ఏఐ పిటిషన్ వేసింది. జూన్‌లో సంస్థను వీడి తిరిగి యాపిల్‌లో చేరిన మాజీ ఉద్యోగి తమ వద్ద ఉన్న రహస్య హార్డ్‌వేర్ సమాచారానికి సంబంధించిన వందకు పైగా అత్యంత గోప్యమైన ఫైళ్లను తీసుకువెళ్లారని ఓపెన్ఏఐ ఆరోపించింది. అనుచిత మార్గాల ద్వారా పోటీని దెబ్బతీసేందుకు యాపిల్ ప్రయత్నిస్తోందని తన దావాలో పేర్కొంది.
ఓపెన్ఏఐ రూపొందిస్తున్న ఏఐ ఆధారిత వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలు యాపిల్ ప్రధాన వ్యాపార రంగానికి సవాలుగా మారుతున్నాయని, అందుకే సరఫరాదారులపై యాపిల్ ఒత్తిడి పెంచుతోందని ఓపెన్ఏఐ వాదించింది. తమ సంస్థ కోసం నిర్వహిస్తున్న ప్రాజెక్టుల వివరాలు, వాటిపై పనిచేస్తున్న ఉద్యోగుల పేర్లు, బాధ్యతలను వెల్లడించాలని సరఫరాదారులను యాపిల్ డిమాండ్ చేస్తోందని తెలిపింది. యాపిల్ వ్యాపార అవకాశాలను కోల్పోతామనే భయంతో సరఫరాదారులు ఇబ్బందులు పడుతున్నారని, ఒక సరఫరాదారు తమ ఉత్పత్తుల తయారీని నైట్ షిఫ్ట్‌కు మార్చాల్సి రావడంతో ఖర్చులు పెరిగాయని, మరో సరఫరాదారు ప్రణాళికాబద్ధమైన పనిని నిలిపివేశారని వెల్లడించింది.
ఉద్యోగులను ఇతర సంస్థల్లోకి వెళ్లకుండా కట్టడి చేసేలా యాపిల్ నిబంధనలు రూపొందించిందని ఓపెన్ఏఐ విమర్శించింది. ఇప్పటివరకు సుమారు 400 మంది ఉద్యోగులు యాపిల్ నుంచి ఓపెన్ఏఐలో చేరారని, మిగిలిన సిబ్బందిని భయపెట్టేందుకు యాపిల్ యత్నిస్తోందని ఆరోపించింది. ఉద్యోగులు తమ వ్యక్తిగత పరికరాలు, క్లౌడ్ ఖాతాలలో సంస్థ ఫైళ్లను నిల్వ చేసుకునేలా ప్రోత్సహించే విధానాలు ఉన్నాయని, మేధో సంపత్తి ఒప్పందాలలో గోప్యతా నిబంధనలను అత్యంత విస్తృతంగా నిర్వచించి ఉద్యోగుల వృత్తిపరమైన నైపుణ్య వినియోగానికి అడ్డంకులు సృష్టిస్తోందని పేర్కొంది.
గత జులైలో ఓపెన్ఏఐతో పాటు మాజీ ఉద్యోగులు చాంగ్ లియు, టాంగ్ టాన్లపై యాపిల్ దావా వేసిన నేపథ్యంలో తాజాగా ఈ ప్రతిదావా తెరపైకి వచ్చింది. అయితే ఓపెన్ఏఐ ప్రతిదావాలు యాపిల్ దావాలోని ప్రధాన అంశాల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమని యాపిల్ ప్రతినిధులు ఖండించారు. మరోవైపు మాజీ డిజైన్ చీఫ్ జోనీ ఐవ్ సహకారంతో ఓపెన్ఏఐ కొత్త కనెక్టెడ్ డివైజ్‌లను అభివృద్ధి చేస్తున్న తరుణంలో, ఈ రెండు సంస్థల మధ్య న్యాయపోరాటం మరింత ఉద్రిక్తంగా మారింది.