లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు!
న్యూఢిల్లీ, నవంబరు 27: మహిళా రిజర్వేషన్లను అమలులోకి తీసుకురావడానికి వీలుగా లోక్‌సభలో డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ బిల్లు ప్రకారం లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభల్లోని ప్రస్తుత స్థానాల సంఖ్యను ఏకంగా 50 శాతం మేర పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనివల్ల లోక్‌సభ స్థానాల గరిష్ఠ సంఖ్య 850కి చేరనుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు ప్రత్యేకంగా డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయనుంది.
నూతన బిల్లు నిబంధనల ప్రకారం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లను రిజర్వ్ చేయనున్నారు. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా ప్రత్యేక కేటాయింపులు ఉండనున్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రొటేషన్ పద్ధతిలో మహిళా రిజర్వుడు స్థానాలను కేటాయించనున్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన పాత బిల్లుపై దక్షిణాది రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో, అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెరిగేలా స్పష్టమైన నిబంధనలతో కేంద్రం ఈ కొత్త ముసాయిదా బిల్లును తీసుకొస్తోంది. ఈ సవరణల ద్వారా ఏర్పడే కొత్త నియోజకవర్గాల సరిహద్దులు 2051 వరకు యథాతథంగా కొనసాగనున్నాయి.