రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్
పాలకొండ, మేజర్ న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్. ప్రభాకర రెడ్డి, ఐ.ఏ.ఎస్., తెలిపారు. ఈ విడతలో పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ నాలుగు మండలాల పరిధిలో మొత్తం 146 గ్రామ పంచాయతీలు, 1274 వార్డులు ఉన్నాయి. వీటిలో 32 సర్పంచ్ స్థానాలు, 555 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 114 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు, 719వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరగనుంది. సర్పంచ్ స్థానాలకు 285 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 1542 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
రెండో విడతలో మొత్తం 172951 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 84119 మంది, మహిళలు 88818 మంది, ఇతరులు 14 మంది ఉన్నారు.
ఎన్నికల నిర్వహణకు 2981 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. పోలింగ్ జరిగే అన్ని గ్రామ పంచాయతీల్లో సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.