జిల్లావ్యాప్తంగా పోలీసుల మెరుపు తనిఖీలు.. 1,019 వాహనాల తనిఖీ, రూ.1.28 లక్షల జరిమానా
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ చేపట్టింది. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఆదేశాల మేరకు జిల్లాలోని 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, కీలక రహదారులపై బందోబస్తు ఏర్పాటు చేసి ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలతో పాటు భారీ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల ధ్రువపత్రాలు, ట్రాఫిక్ నిబంధనల అమలును పరిశీలించడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు.ఈ ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 1,019 వాహనాలను తనిఖీ చేయగా, 206 ఈ-పెట్టి కేసులు, 56 డీడీ కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 294 ఈ-చలాన్లు విధించి మొత్తం రూ.1,28,516 జరిమానా విధించారు. నేరాలకు తావులేకుండా, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ… ప్రజల భద్రత, నేర నియంత్రణ విషయంలో పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రధాన కూడళ్లు, రహదారులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా తనిఖీలు నిర్వహించాలని, ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లను నిరంతరం కొనసాగించాలని సూచించారు.వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ ధరించాలని ఆమె సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, నేరాల నియంత్రణలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించి తమవంతు బాధ్యతగా వ్యవహరించాలని ఆమె కోరారు.