‘సర్పంచ్’ లఘు చిత్రం విడుదల
సూర్య - మానకొండూర్ :మానకొండూర్ మండలం వేగురుపల్లి గ్రామంలో శనివారం ‘సర్పంచ్’ లఘు చిత్రాన్ని (షార్ట్ ఫిల్మ్) యూట్యూబ్ ఛానల్ వేదికగా ఘనంగా విడుదల చేశారు. శివశక్తి క్రియేషన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ లఘు చిత్రాన్ని వేగురుపల్లిలోని నిర్మాత ముద్దసాని వెంకట రాజారెడ్డి నివాసంలో, ఆయన తండ్రి ముద్దసాని రమణారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ.. గ్రామీణ నేపథ్యంతో పాటు సామాజిక అంశాలను స్పృశిస్తూ ఈ లఘు చిత్రాన్ని ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలిపారు. స్థానిక కళాకారుల ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశామని, ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నిర్మాత ముద్దసాని వెంకట రాజారెడ్డి, దర్శకుడు మడుపు శ్రీనివాస్, నటీనటులు రంగు భాస్కరాచారి, కైరి తిరుపతి గౌడ్, థౌట్ రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.