కాలేజీ రోడ్‌లో కోతుల బీభత్సం.. ప్రజలకు తప్పని భయం దాడుల్లో వ్యక్తికి గాయాలు.. నాలుగు కుట్లు
సూర్య మంచిర్యాల : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది.వందల సంఖ్యలో కోతులు ఇళ్ల పరిసరాల్లో సంచరిస్తూ ప్రజలపై దాడులకు పాల్పడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.కోతుల భయంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి నెలకొంది.ఇటీవల కాలేజీ రోడ్‌లో ఓ వ్యక్తిపై కోతులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.దీంతో అతడికి నాలుగు కుట్లు వేయాల్సి వచ్చింది.ఈ ఘటనతో స్థానికుల్లో ఆందోళన మరింత పెరిగింది.చిన్నారులు,వృద్ధులు బయటకు వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు.ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి కోతుల బెడదను నివారించేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.ఈ సందర్భంగా 12వ డివిజన్ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు మాట్లాడుతూ.. కాలేజీ రోడ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కోతుల సంచారం విపరీతంగా పెరిగిందని,ప్రజలపై దాడులు జరుగుతున్నా సమస్య పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ సమస్యపై కార్పొరేషన్ పాలకవర్గం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. కోతుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు.