సనత్ నగర్‌లో మురికినీటి తిప్పలు: జలమండలి ఎండితో మర్రి శశిధర్ రెడ్డి భేటీ
సికింద్రాబాద్ : సనత్ నగర్ నియోజకవర్గంలో తీవ్ర రూపం దాల్చిన మురికినీరు, కలుషిత నీటి సమస్యలపై మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండి అశోక్ రెడ్డిని కలిసిన ఆయన, నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. రాంగోపాల్ పేట్ డివిజన్ ఆవులమంద వివేకానంద స్ట్రీట్‌లో నెలలుగా అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రంగ్రేజీ బజార్‌లో డ్రైనేజీ పనులు పూర్తి కాకుండానే రోడ్లు వేయడంతో మళ్లీ మళ్లీ లీకేజీలు ఏర్పడుతున్నాయని ఎండి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మెక్ లాన్ గూడ్‌లో నిత్యం రోడ్లపై పారుతున్న మురికినీరు, తాగునీటిలో కలుషిత నీరు చేరుతున్న తీవ్ర సమస్యను వివరించారు. కంటోన్మెంట్ ప్రాంత మురికినీటిని క్లాసిగూడ నాలాకు బదులుగా పికెట్ నాలాలో కలపాలని సూచించారు.
ప్రజారోగ్య దృష్ట్యా ఈ సమస్యలన్నింటినీ జలమండలి అధికారులు యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నెమలి ఆనంద్, సందీప్ వర్మ, వి. దయానంద రావు, శ్రీనివాస్ యాదవ్, కిరణ్, బి. వికాస్, కె. నరేష్ తదితరులు పాల్గొన్నారు.