జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా వికారాబాద్‌లో ఘనంగా 2కే రన్.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: భారతదేశ ఐక్యత, సమగ్రత, సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా శనివారం వికారాబాద్ పట్టణంలో 2కే రన్‌ను ఘనంగా నిర్వహించారు. యెన్నెపల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించిన ఈ రన్‌లో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ఐఏఎస్, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, ఐపీఎస్, వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, ఏఆర్ డీఎస్పీ వీరేష్, టౌన్ ఇన్‌స్పెక్టర్ రఘు కుమార్‌తో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువతీ యువకులు, యువజన సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలోని సంస్థానాలను ఏకం చేసి భారతదేశ ఐక్యతకు బలమైన పునాది వేశారని తెలిపారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా దేశ సమగ్రత, ఐక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. యువత దేశాభివృద్ధిలో భాగస్వాములై ఐక్యతతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ జాతీయ ఐక్యతా దినోత్సవం ప్రతి పౌరుడికి దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యతను గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు, యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ప్రజలందరూ ఐకమత్యంతో ముందుకు సాగుతూ దేశాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. 2కే రన్ ద్వారా దేశ ఐక్యత, సోదరభావం, జాతీయ సమైక్యత ప్రాధాన్యతను ప్రజలకు చాటిచెప్పారు. దేశ ఐక్యతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అనే సందేశంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.