మంగళకుంట గ్రామానికి థార్ రోడ్డు నిర్మాణం.
**కళ్యాణదుర్గం:** ఏళ్ల తరబడి రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మంగళకుంట గ్రామ ప్రజల కష్టాలకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామం ఏర్పడినప్పటి నుంచి సరైన తారు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు నిత్యం మట్టి రోడ్డు, గుంతలు, బురదతో కూడిన దారిలో ప్రయాణిస్తూ అనేక అవస్థలు పడేవారు. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్డు మరింత అధ్వానంగా మారి ద్విచక్ర వాహనదారులు, రైతులు, విద్యార్థులు, వృద్ధులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా, వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించాలన్నా గ్రామస్తులకు ఈ రహదారి పెద్ద సమస్యగా మారింది. రోడ్డు నిర్మాణం చేపట్టాలని గతంలో పలువురు ప్రజాప్రతినిధులు, పాలకులకు ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో ఎన్నో ఏళ్లుగా గ్రామ ప్రజలు రోడ్డు సౌకర్యం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును గ్రామ ప్రజలు కలిసి తమ రహదారి సమస్యను వివరించి, నూతిమడుగు ప్రధాన రహదారి నుంచి మంగళకుంట గ్రామం వరకు తారు రోడ్డు నిర్మించాలని కోరారు. గ్రామస్తుల విజ్ఞప్తిపై స్పందించిన ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంతో పాటు పనులు త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేశారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు నూతిమడుగు ప్రధాన రహదారి నుంచి మంగళకుంట గ్రామం వరకు సుమారు 1.9 కిలోమీటర్ల మేర రూ.1.16 కోట్ల వ్యయంతో నూతన తారు రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో ఇన్నాళ్లూ గుంతలమయమైన మట్టి రోడ్డుపై నరకప్రాయమైన ప్రయాణం చేసిన గ్రామ ప్రజలకు ఇప్పుడు సాఫీగా రాకపోకలు సాగించే అవకాశం కలిగింది. నూతన రోడ్డు అందుబాటులోకి రావడంతో గ్రామానికి రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, చిరువ్యాపారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. అత్యవసర వైద్య సేవలు పొందేందుకు కూడా రహదారి ఎంతో ఉపయోగకరంగా మారనుంది. గ్రామ అభివృద్ధికి రోడ్డు సౌకర్యం ఎంతో కీలకమని, ఈ నిర్మాణంతో తమ చిరకాల సమస్య పరిష్కారమైందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తమ విజ్ఞప్తులను పట్టించుకోని పరిస్థితుల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమస్యను గుర్తించి, హామీ ఇచ్చిన విధంగా నిధులు మంజూరు చేయించి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించడం పట్ల గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మంగళకుంట గ్రామానికి నూతన రహదారి అందుబాటులోకి రావడం గ్రామ అభివృద్ధిలో కీలక ముందడుగుగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.