కోతుల దాడులతో విసిగిపోయిన గ్రామస్తులు.. స్వచ్ఛందంగా నిధుల సేకరణ
నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామంలో కోతుల గుంపుల నుంచి ఊరికి విముక్తి కల్పించేందుకు ఈదులూరు గ్రామస్తులు కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కోతులను పట్టించేందుకు అయ్యే ఖర్చును గ్రామస్తులే భరించాలని నిర్ణయించి, ప్రతి ఇంటి నుంచి రూ.500 చొప్పున వసూలు చేయాలని తీర్మానించారు. శనివారం గ్రామ పంచాయతీ వద్ద జరిగిన సమావేశంలో గ్రామ పెద్దలు, ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడంతో పాటు ప్రజలపై దాడులు చేస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో వార్డు సభ్యులు డబ్బులు సేకరించి కోతులను పట్టుకునే నిపుణులకు చెల్లించనున్నారు. గ్రామస్తులంతా సహకరించాలని పెద్దలు కోరారు.