జాతీయ సమగ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు
సూర్య - పెద్దపల్లి: దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు పిలుపునిచ్చారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ ప్రజల్లో జాతీయ ఐక్యతా భావాన్ని పెంపొందించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన ఉక్కు సంకల్పాన్ని భావితరాలు ఆదర్శంగా తీసుకొని దేశ ఐక్యత, సమగ్రత కోసం కృషి చేయాలన్నారు. అనంతరం దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడేందుకు అంకితభావంతో పనిచేస్తామని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.