కలెక్టరేట్ లో ఘనంగా ఐక్యతా దినోత్సవ వేడుకలు.:
సూర్య నిర్మల్ ప్రతినిధి :
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా స్పూర్తితో ముందుకు సాగాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
కలెక్టరేట్ లో ఘనంగా ఐక్యతా దినోత్సవ వేడుకలు.
భారత తొలి ఉప ప్రధాని, మాజీ హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 151 వ జయంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అధికారులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించడమే కాకుండా, స్వాతంత్ర్యం అనంతరం అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఉక్కుమనిషి పటేల్ అని కొనియాడారు. అధికారులు, సిబ్బంది అంతా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని తెలిపారు.
ఈ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, వెంకట మాధవ రావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.