సిద్ధార్థ్ మల్హోత్రాతో వరుణ్ ధావన్ ఫన్నీ రీసెంట్ మీట్... కాఫీ విత్ కరణ్ జోక్ వైరల్!
సూర్య ఎంటర్టైన్మెంట్ డెస్క్: బాలీవుడ్ చాట్ షో 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో హీరో వరుణ్ ధావన్ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన సహనటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ఉద్దేశించి వరుణ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుండగా, తాజాగా ఈ ఇద్దరు స్నేహితులు సరదాగా కలుసుకోవడం విశేషంగా నిలిచింది. సిద్ధార్థ్ మల్హోత్రా, కైరా అద్వానీ దంపతులను కలిసి దిగిన సెల్ఫీని వరుణ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ క్యూట్ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది.
తాజాగా ప్రసారమైన కాఫీ విత్ కరణ్ తాజా సీజన్లో పాల్గొన్న వరుణ్ ధావన్‌ను, కెనడియన్ రొమాంటిక్ సిరీస్ 'హీటెడ్ రైవలరీ' భారతీయ రీమేక్ చేస్తే ఏ నటుడిని ఎంచుకుంటావని హోస్ట్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన వరుణ్, తన మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' కో-స్టార్ అయిన సిద్ధార్థ్ మల్హోత్రా పేరును సూచించారు. అంతేకాకుండా వారిద్దరి మధ్య సినిమాలో కెమిస్ట్రీ చూస్తే ఆ పాత్రలకు తాము కచ్చితంగా సరిపోతామని, ఆ సినిమాలో కూడా తమ మధ్య అలాంటి వైబ్స్ కనిపించాయని వరుణ్ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ఫన్నీ కామెంట్స్ అప్పట్లో షోలో నవ్వులు పూయించాయి.
ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్ మల్హోత్రాను నేరుగా కలిసిన వరుణ్ ధావన్, ఆ సరదా జోక్‌ను కంటిన్యూ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫన్నీ పోస్ట్ పెట్టారు. మా మధ్య ఉద్రిక్తత ఉండవచ్చు కానీ ఎలాంటి శత్రుత్వం లేదని, ఆతిథ్యం ఇచ్చినందుకు వదిన గారికి ధన్యవాదాలు అంటూ వరుణ్ క్యాప్షన్ జోడించారు. ఈ ఫోటోలో వరుణ్ సెల్ఫీ తీసుకుంటుండగా, వెనుక నిలబడిన కైరా అద్వానీ వారిద్దరిని విడదీస్తున్నట్లుగా సరదాగా పోజు ఇవ్వడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వరుణ్ పెట్టిన ఈ పోస్ట్‌ను సిద్ధార్థ్ రీషేర్ చేస్తూ నువ్వు ఎప్పటికీ నా మొదటి వాడివి అంటూ ఫన్నీగా రిప్లై ఇఛ్చారు.
కరణ్ జోహార్ దర్శకత్వంలో 2012లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా ఇద్దరూ ఒకేసారి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ సినిమా నుంచి ఇప్పటివరకు వీరిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. స్క్రీన్ పై ప్రత్యర్థులుగా కనిపించినప్పటికీ నిజ జీవితంలో బలమైన సోదరభావం కలిగి ఉన్నామని నిరూపిస్తూ వీరు షేర్ చేసిన ఈ తాజా పిక్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ ఇద్దరు హీరోలు మళ్లీ వెండితెరపై కలిసి కనిపించాలని ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు.